సాగర్‌ ప్రధాన కాల్వ కట్టపై పగుళ్లు | - | Sakshi
Sakshi News home page

సాగర్‌ ప్రధాన కాల్వ కట్టపై పగుళ్లు

Apr 8 2026 7:26 AM | Updated on Apr 8 2026 7:26 AM

ప్రమాదాలకు చేరువగా పరిస్థితి?

క్షేత్రస్థాయిలో పరిశీలించిన

అధికారులు

ఖమ్మంఅర్బన్‌: జిల్లాలోని ఖమ్మం రూరల్‌ మండలం పల్లెగూడెం పరిధి సాగర్‌ ప్రధాన ఎడమ కాల్వ కట్ట ప్రమాదం ముంగిట ఉన్నట్లు తెలుస్తోంది. పల్లెగూడెం నుంచి కరకట్టకు వెళ్లే మార్గంలో కాల్వకు ఇరువైపులా కట్టపై బీటలు (నెర్రెలు) వారాయి. వారం రోజులుగా పగుళ్లు బయటపడుతుండగా రోజురోజుకూ విస్తరిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. సుమారు అర కిలోమీటరు పొడవునా ఈ పగుళ్లు ఏర్పడ్డాయి. పగుళ్లు పెరుగుతున్న వేళ వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టకపోతే భవిష్యత్‌లో పెనుప్రమాదం సంభవించే అవకాశం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు.ప్రస్తుతం సాగునీటి విడుదల కొనసాగుతుండగా, పగుళ్లు మరింత పెరిగితే ప్రమాదం జరగొచ్చని స్థానికులు అంటున్నారు. కట్ట దెబ్బతింటే సమీప గ్రామాలకు ముప్పు ఏర్పడే అవకాశముందని ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

పరిశీలించిన అధికారులు

కాల్వ కట్టపై పగుళ్లు ఏర్పడ్డాయనే సమాచారంతో జలవనరులశాఖ అధికారులు రంగంలోకి దిగారు. ఈ మేరకు ఇంజనీర్లు, రెవెన్యూ అధికారులు నెర్రలు బారిన కట్ట ప్రాంతాన్ని మంగళవారం పరిశీలించారు. అంతేకాక ఉన్నతాధికారులకు వివరించినట్లు తెలిసింది. జలవనరులశాఖ ఈఈ అనన్య, డీఈ ఉదయ్‌ప్రతాప్‌, ఏఈ సతీశ్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement