26 క్వింటాళ్ల నిబంధన సరికాదు
కలెక్టరేట్ ఎదుట ధర్నాలో
తెలంగాణ రైతు సంఘం నాయకులు
ఖమ్మంమయూరిసెంటర్: మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు సకాలంలో ప్రారంభించకుండా ప్రభుత్వం జాప్యం చేయడంతో రైతులు నష్టపోతున్నారని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకుడు నున్నా నాగేశ్వరరావు అన్నారు. ఈ మేరకు ప్రతీ గ్రామంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడమే కాక ఎకరాకు 26 క్వింటాళ్ల సేకరణ నిబంధన తొలగించాలని డిమాండ్ చేశారు. వీటితో పాటు సాదాబైనామా దరఖాస్తుల పరిశీలన, అర్హులైన రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు, ప్రతీ రైతుకు భూభారతి పోర్టల్ ద్వారా పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ డిమాండ్‌తో కలెక్టరేట్ ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. సకాలంలో మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు క్వింటాకు రూ.700 నుంచి రూ.800 నష్టపోతున్నారన్నారు. జిల్లాలో 1.80 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 2.65 లక్షల ఎకరాల్లో వరి సాగైన నేపథ్యాన ప్రతీ గ్రామంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టికి వినతిపత్రం అందజేశారు. తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొంతు రాంబాబు, నాయకులు బండి రమేశ్, ఎస్‌కే మీరా, దుగ్గి కృష్ణ, గొడవర్తి నాగేశ్వరరావు, వాసిరెడ్డి ప్రసాద్, గంగాధర్, దొండపాటి నాగేశ్వరరావు, రచ్చా నరసింహారావు, నల్లమోతు మోహన్‌రావు, వై.విక్రమ్, యర్రా శ్రీనివాసరావు, లత, సునీత, మల్లెంపాటి రామారావు పాల్గొన్నారు.


