ఖమ్మంవైరారోడ్: రాష్ట్రప్రభుత్వం పంటల కొనుగోళ్లలో విఫలమై రైతుల విషయంలో నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య విమర్శించారు. డీసీసీబీ, జెడ్పీ మాజీ చైర్మన్లు కూరాకుల నాగభూషణం, లింగాల కమల్‌రాజుతో కలిసి మంగళవారం ఆయన ఖమ్మంలోని బీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయంలో మాట్లాడారు. కేసీఆర్ పాలనలో పంటలు చేతికి రాకముందే కొనుగోలు కేంద్రాలు, బస్తాలు సిద్ధం చేయగా, ఇప్పుడు ఏప్రిల్ వచ్చినా కొనుగోళ్ల ప్రక్రియ మొక్కుబడిగా సాగుతోందని మండిపడ్డారు. వరికి మద్దతు ధర రూ.2,389 ఉంటే కేంద్రాలు లేకపోవడంతో వ్యాపారులకు రైతులు రూ.1,800కే అమ్ముకుంటూ క్వింటాకు రూ.600 మేర నష్టపోతున్నారని తెలిపారు. మొక్కజొన్నల విషయంలోనూ అదే పరిస్థితి నెలకొందని చెప్పారు. ఇకనైనా వేయి ఎకరాలకు పైగా మొక్కజొన్న, వరి సాగైన ప్రతీ గ్రామంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని సండ్ర, నాగభూషణం, కమల్‌రాజ్ డిమాండ్ చేశారు. కాగా, పారిశ్రామిక అభివృద్ధి పేరుతో రైతుల భూములు లాక్కుంటుండగా, అడ్డుకోవడానికి వెళ్తున్న మాజీ మంత్రి హరీష్‌రావును అరెస్టు చేయడం గర్హనయమని పేర్కొన్నారు. నాయకులు ఉన్నం బ్రహ్మయ్య, వాచేపల్లి లక్ష్మారెడ్డి, కనగాల వెంకట్రావు, పగడాల నరేందర్, సామినేని హరిప్రసాద్, ముత్యాల వెంకటఅప్పారావు, మంకెన్ రమేష్, బొడ్డు వెంకట రామారావు తదితరులు పాల్గొన్నారు.
రేపు మండల కేంద్రాల్లో ధర్నా
వేయి ఎకరాలకు పైగా వరి, మొక్కజొన్న సాగైన ప్రతీ గ్రామంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయాలని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు డిమాండ్ చేశారు. ఈమేరకు 9వ తేదీన అన్ని మండలాల్లో కేంద్రాల్లో ధర్నా నిర్వహించనున్నట్లు తెలి పారు. పార్టీ శ్రేణులతో పాటు రైతులు పాల్గొని ధర్నాలను విజయవంతం చేయాలని ఆయన కోరారు.


