ఖమ్మంరూరల్: పదోతరగతి పరీక్ష రాసిన విద్యార్థులు బస్సులో పాఠశాలకు వెళ్తుండగా లారీ ఢీకొట్టడంతో పలువురు గాయపడ్డారు. ఆరెంపులలోని ముస్లిం మైనార్టీ పాఠశాల పదో తరగతి విద్యార్థులు 30 మంది మంగళవారం సత్యనారాయణపురంలోని కేజీబీవీలో పరీక్ష రాశారు. తిరిగి బస్సులో పాఠశాల హాస్టల్‌కు బస్సులో బయలుదేరారు. బస్సు సత్యనారాయణపురం వద్ద ఇందిరమ్మ కాలనీ వైపు తిరుగుతుండగా ఖమ్మం వైపు నుంచి వరంగల్ క్రాస్‌రోడ్డు వైపు వెళ్తున్న లారీ అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులోని ఎస్‌కే షమీర్, హనీఫ్, ఫిరోజ్, ఎండీ పాషా, ఎస్‌కే అఫ్రోజ్ సహా 23 మందికి స్వల్ప గాయాలయ్యాయి. అదే సమయాన అక్కడే ఉన్న ఏదులాపురం మున్సిపల్ చైర్‌పర్సన్ పోకబత్తిని అనిత స్థానికుల సాయంతో విద్యార్థులను చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే, విద్యార్థులెవరికీ ప్రమాదం లేదని చెప్పడంతో చికిత్స అనంతరం హాస్టల్‌కు పంపించారు. కాగా, బస్సు డ్రైవర్ కె.సుమన్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ ముష్క రాజు తెలిపారు.
23 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలు


