పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మం సహకారనగర్: ప్రజలు అందించే ప్రతీ ఫిర్యాదును పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డితో కలిసి సోమవారం ఆయన ప్రజావాణిలో భాగంగా ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతిపత్రాలు స్వీకరించారు. అనంతరం పరిశీలన, పరిష్కారంపై అధికారులకు సూచనలు చేశారు. డీఆర్వో పద్మశ్రీ, జెడ్పీ సీఈఓ దీక్షారైనా, కలెక్టరేట్ ఏఓ శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఫిర్యాదుల్లో కొన్ని..
కూసుమంచి మండలం మునిగేపల్లికి చెందిన కె.నరేందర్ ఎస్సీ కాలనీలో స్థలం పట్టా మంజూరు చేయాలని కోరారు. సింగరేణి మండలం ఉసిరికాయలపల్లిలో తమ భూమిని హైవే నిర్మాణానికి సేకరించినందున పరిహారం ఇప్పించాలని జి.దేవిశ్రీ వినతిపత్రం అందజేశారు. అలాగే, అక్రమంగా జరుగుతున్న మట్టి తవ్వకాలను అరికట్టాలని ఏన్కూరు మండలం బద్రుతండ, ఒంటి గుడిసె గ్రామప్రజలు కోరారు.
ధాన్యం కొనుగోళ్లకు ప్రణాళిక
యాసంగి సాగైన ధాన్యం కొనుగోళ్లకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ కోతలు మొదలయ్యే ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరవాలని, ఇందుకోసం షెడ్యూలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
అర్హులకు లబ్ధి జరిగేలా..
పాలన పారదర్శకంగా నిర్వహిస్తూ అర్హులకు పథకాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో వివిధ శాఖలో అధికారులతో సమావేశమైన తక్కువ హాజరు నమోదు ఉన్న శాఖల అధికారులు వివరణ సమర్పించాలని సూచించారు. అలాగే, రెవెన్యూ సదస్సులు, భూభారతి దరఖాస్తులు, భూసేకరణపై చర్చించారు. కాగా, చిన్న కోరుకోండిలో మహిళా సంఘాల ద్వారా చేపట్టిన సౌర విద్యుత్ ప్లాంట్ పనులు ఆలస్యం అవుతున్నందున ప్రత్యామ్నాయ స్థలం ఎంపిక చేయాని తెలిపారు. ఆతర్వాత మాతా, శిశు మరణాలు తగ్గింపునకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. అలాగే, మార్చిలో ఉద్యోగ విరమణ చేసిన వివిధ శాఖల అధికారులు బి.అరుణ్ కుమార్, బి.జయదాస్, ఎండీ.అఫ్జల్ మియా, ఎం.వీ.నరసింహారావు, ఎస్.కే.ఆసిఫ్‌మియా, ఐ.ఉమేశ్వర్, డి.అమతమ్మ, డి.ఎలీశమ్మను సన్మానించారు.
కలెక్టర్‌ను కలిసిన పరిశ్రమల శాఖ జీఎం
ఖమ్మంఅర్బన్: జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్(జీఎం)గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ప్రవీణ్‌కుమార్ సోమవారం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈమేరకు జిల్లాలో పరిశ్రమల వృద్ధి ద్వారా ఉపాధి అవకాశాలు పెంచేలా కార్యాచరణ చేపట్టాలని కలెక్టర్ సూచించారు.
ఖమ్మంరూరల్: విద్యాసంస్థల్లోని ప్రతీ విద్యార్థి ఆరోగ్యంపై శ్రద్ధ వహించేలా అందరి హెల్త్ ప్రొఫైళ్లు రూపొందించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి నాయుడుపేటలోని కస్తూర్భాగాంధీ విద్యాలయాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ఈసందర్భంగా తరగతి గదులు, వంటగది, ఆహార నాణ్యత, కూరగాయలను పరిశీలించాక మాట్లాడారు. ప్రహారీ, డైనింగ్ హాల్ నిర్మాణానికి ప్రతిపాదనలు ఇవ్వాలని తెలిపారు. మండల ప్రత్యేకాధికారుల ప్రతీ వారం కేజీబీవీలు, గురుకులాలు, ఇతర ప్రభుత్వ విద్యాసంస్థలను తనిఖీ చేసి మెనూ అమలు, సరుకుల నాణ్యతను పరిశీలించాలన్నారు. విద్యార్థులకు రుచికరమైన ఆహారం అందితే చదువుపై దృష్టి పెడతారని తెలిపారు. జిల్లా జెండర్ ఈక్వాలిటీ కోఆర్డినేటర్ రూబీ, ప్రత్యేకాధికారి ఆజియా, ఉద్యోగులు పాల్గొన్నారు.


