ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు రామసహాయం రఘురాంరెడ్డి మంగళవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఖమ్మం గట్టయ్య సెంటర్‌లోని క్యాంప్ కార్యాలయంలో వివిధ మండలాల లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేస్తారు. ఆతర్వాత ముదిగొండ మండలంలోని న్యూలక్ష్మీపురం, వల్లభి, గంధసిరి గ్రామాల్లో సీసీ రోడ్లను ప్రారంభించనున్న ఎంపీ.. పమ్మి, కమలాపురం, బాణాపురంల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయడమే కాక బోర్ వెల్‌లను ప్రారంభిస్తారు.
హెచ్‌డబ్ల్యూఓల ఫోరం అధ్యక్షుడికి ‘దళితరత్న’ అవార్డు
ఖమ్మంమయూరిసెంటర్: విద్యా, సామాజిక సేవా రంగాల్లో రాణిస్తున్న ఎస్సీ వసతి గృహాల సంక్షేమ అధికారుల ఫోరం జిల్లా అధ్యక్షుడు కోటపాటి రుక్మారావుకు ‘దళితరత్న’ అవార్డు లభించింది. రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ, బాబు జగ్జీవన్ రామ్ జయంతోత్సవ కమిటీ ఆధ్వర్యాన హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయనకు రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అడిషనల్ డైరెక్టర్ సి.శ్రీధర్, ఉత్సవ కమిటీ కన్వీనర్ దొమ్మాటి సుదర్శన్ బాబు అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా అడిషనల్ డైరెక్టర్ శ్రీధర్, సుదర్శన్ మాట్లాడుతూ మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న వ్యక్తులను గుర్తించి ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. అవార్డు గ్రహీత రుక్మారావు మాట్లాడుతూ భవిష్యత్‌లోనూ హాస్టల్ విద్యార్థుల సంక్షేమం, సమాజ సేవకు పాటుపడతానని తెలిపారు. కాగా, రుక్మారావుకు పలువురు అభినందించారు.
108 వాహనం తనిఖీ
తిరుమలాయపాలెం: తిరుమలాయపాలెం మండలానికి కేటాయించిన 108 వాహనాన్ని జీవీకే గ్రీన్ హెల్త్ సర్వీసెస్ క్వాలిటీ కంట్రోల్ ఆడిటింగ్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంబులెన్స్‌లోని పరికరాలు, నిర్వహణ, మందుల లభ్యత, ఆక్సిజన్ నిల్వలను పరిశీలించడంతో పాటు కేసులపై ఆరా తీశారు. సిబ్బంది అప్రమతంగా ఉంటూ క్షతగాత్రులను వీలైనంత త్వరగా ఆస్పత్రులకు చేర్చాలని సూచించారు. ప్రోగ్రామ్ మేనేజర్ నజీరుద్దీన్, సూపర్‌వైజర్ దుర్గాప్రసాద్, సిబ్బంది కృష్ణయ్య, సక్రు పాల్గొన్నారు.
ఏడు సిలిండర్లు స్వాధీనం
చింతకాని: మండలంలోని పందిళ్లపల్లిలో ఒక ఫుడ్ ఫ్యాక్టరీలో అక్రమంగా నిల్వ చేసిన ఏడు గృహోపయోగ గ్యాస్ సిలిండర్లను పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు ఫ్యాక్టరీ యజమానిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వీరేందర్ తెలిపారు.
పిప్పిరి సభకు తరలిన కాంగ్రెస్ శ్రేణులు
ఖమ్మంమయూరిసెంటర్: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా పిప్పిరిలో సోమవారం నిర్వహించిన బహిరంగ సభకు జిల్లా నుంచి కాంగ్రెస్ నాయకులు తరలివెళ్లారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యాన పలువురు వాహనాల్లో బయలుదేరారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ 2023 మార్చి 16న ప్రారంభమైన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర తెలంగాణ రాజకీయ చరిత్రలో కీలక మలుపుగా నిలిచిందన్నారు. నాయకులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, రంగా జనార్దన్, కూరపాటి కిషోర్, వేజండ్ల సాయి కుమార్, మొక్క శేఖర్‌గౌడ్, బానోత్ బాలాజీనాయక్, కోసూరి శ్రీనివాస్, నూతి వెంకటేశ్వరరావు, మూడుముంతల గంగరాజు యాదవ్, బాబు జానీ, గజ్జి సూర్యనారాయణ, గుమ్మా రోశయ్య, వేల్పుల మురళి, శేఖర్, జెర్రిపోతుల అంజనీకుమార్ పాల్గొన్నారు.


