కొడుకును కాలేజీలో చేర్చడానికి వెళ్తూ... | - | Sakshi
Sakshi News home page

కొడుకును కాలేజీలో చేర్చడానికి వెళ్తూ...

Apr 7 2026 7:31 AM | Updated on Apr 7 2026 7:31 AM

● రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి ● లారీ రూపంలో కబళించిన మృత్యువు

రాజమండ్రి నుంచి ప్రయాణం

● రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి ● లారీ రూపంలో కబళించిన మృత్యువు

కొణిజర్ల: పదో తరగతి పూర్తి చేసిన కుమారుడికి బంగారు భవిష్యత్‌ ఇవ్వాలని ఆ దంపతులు కల కన్నారు. అందులో భాగంగా ఉత్తమ బోధన ఉండే కాలేజీని ఎంచుకుని చేర్పించాలని హైదరాబాద్‌ బయలుదేరారు. కానీ వారు గమ్యాన్ని చేరకుండానే కన్నుమూశారు. ఈ ప్రమాదంలో తల్లిదండ్రులు మృతి చెందగా కుమారుడు తీవ్రగాయాలతో బయటపడ్డాడు. కొణిజర్ల వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదం వివరాలు...

ఆస్పత్రికి తరలించేలోగా..

అప్రమత్తమైన స్థానికులు కారులో నుంచి వీర శైలజను, యశ్వంత్‌ను బయటకు తీసి 108లో ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శైలజ మృతి చెందింది. అలాగే, వీర్రాజు కారు సహా లారీ కింద ఇరుక్కుపోవడంతో పోలీసులు రెండు జేసీబీల సాయంతో విడదీసి వీర్రాజు, లారీ డ్రైవర్‌ శ్రీనును బయటకు తీసి ఆస్పత్రికి పంపించారు. అయితే, ప్రమాదం జరిగాక గంటకు పైగా తీవ్ర రక్తస్రావం జరగడంతో వీర్రాజును ఆస్పత్రికి తీసుకెళ్లేలోగా మృతి చెందాడు. కాగా, కారును ఢీకొట్టిన లారీ అడ్డం తిరిగి బ్రిడ్జిపై అడ్డంగా నిలిచిపోవడంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. గంటన్నర పాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడగా ఎస్‌ఐ జి.సూరజ్‌ నేతృత్వాన జేసీబీలతో వాహనాలను పక్కకు తప్పించి రాకపోకలను క్రమబద్ధీకరించారు. ఇక ట్రాఫిక్‌ జామ్‌ అయిన క్రమాన కొణిజర్ల ఎంపీడీఓ కార్యాలయం వద్ద నిలిచిన లారీని ధాన్యం లోడ్‌తో వచ్చిన మరో లారీ వెనక నుంచి ఢీకొట్టింది. ఘటనలో ధాన్యం లోడు లారీ డ్రైవర్‌ స్వల్పంగా గాయపడ్డాడు.

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి మోరంపూడి గాదాలమ్మనగర్‌కు ఉండమట్ల వీర్రాజు(46) ధవళేశ్వరంలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య వీర శైలజ (36), కుమారుడు యశ్వంత్‌ ఉన్నారు. యశ్వంత్‌ ఇటీవల పదోతరగతి పూర్తిచేయగా ఇంటర్‌లో చేర్పించేందుకు హైదరాబాద్‌లోని కళాశాలలు చూడడమే కాక బంధువులను కలవాలని కారులో బయలుదేరారు. వీరి కారు సోమవారం తెల్లవారుజామున కొణిజర్లలోని సాగర్‌ కాల్వ బ్రిడ్జిపైకి రాగానే ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో లారీ ముందు టైరు రిమ్ము విరిగిపోవడమే కాక కారు లారీ కిందకు దూసువెళ్లింది. ఆపై లారీ అదుపు తప్పి బ్రిడ్జిపై అడ్డంగా తిరిగింది. అదేసమయాన వైరా వైపు నుంచి వస్తున్న మరో లారీని సైతం ఢీకొట్టింది. ఘటనలో కారు నడుపుతున్న వీర్రాజు, ముందు సీట్లో కూర్చున్న వీరశైలజ తీవ్రంగా గాయపడ్డారు. అలాగే, లారీ డ్రైవర్‌ అలుగోలు శ్రీను క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు.

Advertisement
 
Advertisement
Advertisement