వేగంగా.. సులభంగా ! | - | Sakshi
Sakshi News home page

వేగంగా.. సులభంగా !

Apr 6 2026 7:24 AM | Updated on Apr 6 2026 7:24 AM

విద్యుత్‌ అత్యవసర సేవలకు

ప్రత్యేక బృందాలు

ఆరుగురు చొప్పున సభ్యులతో

ఐదు బృందాల ఏర్పాటు

ప్రకృతి వైపరీత్యాల సమయాన

మరమ్మతులకు సిద్ధం

వేగంగా పరిష్కరించేందుకే...

ఖమ్మంవ్యవసాయం: ఈదురుగాలులతో కూడిన వర్షం ఎప్పుడు కురుస్తుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఈక్రమాన చెట్లు విరిగి విద్యుత్‌ లైన్లపై పడినా, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగి సరఫరాకు అంతరాయం ఏర్పడినా తక్షణమే మరమ్మతులు చేసేలా ఖమ్మం సర్కిల్‌ పరిధిలో ఎమర్జెన్సీ రీస్టోరేషన్‌ బృందాలను ఏర్పాటుచేశారు. ఐటీఐలో ఎలక్ట్రీషియన్‌, ఫిట్టర్‌ విద్యార్హత, ఇతర సాంకేతికత నైపుణ్యాలు ఉన్న వారిని ఈ బృందాల్లో నియమించారు. సర్కిల్‌ పరిధిలో ఆరుగురు సభ్యులతో ఐదు బృందాలను ఏర్పాటుచేశారు. ఈ బృందాలకు పనిమట్లు, కండక్టర్లు, ఇన్సులేటర్లు, కేబుళ్లతో కూడిన వాహనాలు కూడా సమకూర్చారు.

మున్సిపాలిటీల వారీగా..

జిల్లాలోని మున్సిపాలిటీలను కేంద్రాలుగా చేసుకుని ఈ బృందాలను నియమించారు. అయితే మున్సిపాలిటీ పరిధిలోనే కాక కేటాయించిన ఇతర ప్రాంతాల్లోనూ విద్యుత్‌ పునరుద్ధరణ పనులు చేపట్టాల్సి ఉంటుంది. సర్కిల్‌ పరిధిలో ఐదు విద్యుత్‌ డివిజన్లు, 13 సబ్‌ డివిజన్లు ఉండగా ఇక్కడి అధికారుల పర్యవేక్షణలో బృందాలు పనిచేస్తాయి. ఖమ్మం నగరంలో రెండు బృందాలతో పాటు మధిర, ఏదులాపురం, సత్తుపల్లి మున్సిపాలిటీల పరిధిలో ఒక్కో బృందాన్ని నియమించారు.

సమస్య ఉన్న చోటకు...

వేసవిలో ఈదురుగాలుల కారణంగా విద్యుత్‌ స్తంభాలు విరగడంతో పాటు లైన్లు తెగిపడడం, ట్రాన్స్‌ఫార్మర్లు కూలిపోవడం, తీగలు, స్తంభాలపై చెట్ల కొమ్మలు విరిగిపడడడం జరుగుతుంటుంది. ఇలాంటి సమస్యలు ఎదురైన చోటకు బృందాలు చేరుకుని విద్యుత్‌ లైన్ల పురుద్ధరణ పనులు చేపడతారు. వాహనాలకు జీపీఆర్‌ఎస్‌ అమర్చిన నేపథ్యాన సమస్య ఎదురైన ప్రాంతానికి సులువుగా చేరుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. అయితే, బృందాలను ఎమర్జెన్సీ రీస్టోరేషన్‌ సేవలకే కాక సెక్షన్లలోని ఆపరేషన్‌ మెయింటనెన్స్‌ విభాగంలో సిబ్బంది కొరత ఉన్న చోట కూడా పనులకు వినియోగిస్తున్నారు.

విద్యుత్‌ మరమ్మతులు, పునరుద్ధరణ పనులను వేగంగా చేపట్టేలా ఎమర్జెన్సీ రీస్టోరేషన్‌ బృందాలను ఏర్పాటు చేశాం. సమస్య ఉన్న చోటకు సభ్యులు వాహనాల్లో వెళ్లి పనులు చేపడుతారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ వాహనాలపై 1912 టోల్‌ ఫ్రీ నంబర్‌ ముద్రించాం. సమస్య ఉన్న ప్రాంతం వివరాలను ఫోన్‌లో తెలియచేస్తే బృందాలు చేరుకుంటాయి.

– ఇనుగుర్తి శ్రీనివాసాచారి, ఎస్‌ఈ, ఖమ్మం

Advertisement
 
Advertisement
Advertisement