ఖమ్మంఅర్బన్: విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవడమే తల్లిదండ్రులకు ఇచ్చే అతి పెద్ద బహుమతి అని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పదో తరగతి పరీక్షలకు హాజరై మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు. ఖమ్మంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని ఆదివారం తనిఖీ చేసిన కలెక్టర్... తరగతి గదులు, పాఠశాల పరిసరాలను పరిశీలించి మౌలిక వసతులు, వంటగది పరిశుభ్రత, బియ్యం, కూరగాయల నాణ్యతపై ఆరా తీశారు. ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులతో మాట్లాడిన ఆయన మెనూ అమలు, బోధన, వసతుల వివరాలు తెలుసుకున్నారు. ఇప్పటి వరకు రాసిన పరీక్షల వివరాలు తెలుసుకున్నాక, మిగిలిన పరీక్షలు కూడా భయం లేకుండా రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. ఎంత సమయం చదివామన్నది కాక ఎంత శ్రద్ధగా చదివామన్నదే ప్రధానమని తెలిపారు. ఎండలు పెరుగుతున్నందున తగినంత నీరు తాగుతూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని చెప్పారు. జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి పెసర ప్రభాకర్‌రెడ్డి, జిల్లా జెండర్ ఈక్వాలిటీ కోఆర్డినేటర్ రూబీ, ఖమ్మం అర్బన్ ఎంఈఓ శైలజాలక్ష్మి పాల్గొన్నారు.
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి


