నేలకొండపల్లి: ప్రయాణికులు చేయి ఎత్తినా బస్సు ఆపలేదంటూ బైక్ అడ్డు పెట్టి నిరసన తెలిపిన ఘటన ఇది. కోదాడ డిపో బస్సు ఆదివారం ఖమ్మం వెళ్తుండగా నేలకొండపల్లి స్టేజీ వద్ద పలువురు ఆపేందుకు ప్రయత్నించారు. బస్సు వెంట పరుగెత్తినా ఫలితం లేకపోవడంతో కొందరు బైక్‌లపై వెళ్లి బస్సుకు అడ్డంగా పెట్టి నిరసన తెలిపారు. మండే ఎండలో వేచి ఉంటే బస్సు ఆపకపోవడం ఏమిటని డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగారు. ఇకనైనా స్టేజీల వద్ద బస్సులు ఆపేలా అధికారులు డ్రైవర్లకు సూచనలు చేయాలని పలువురు కోరారు.
రైతులకు పరిహారం
అందించాలి
మధిర: మధిరలోని సాయిబాలాజీ కోల్డ్ స్టోరేజీ ఇటీవల అగ్నిప్రమాదంలో కాలిపోగా, మిర్చి నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం చెల్లించాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు కోరారు. మధిరలో ఆదివారం జరిగిన కోల్డ్ స్టోరేజీ బాధిత రైతుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అగ్ని ప్రమాదంలో రూ.కోట్ల విలువైన మిర్చి నష్టపోయిన రైతులకు వెంటనే ఇన్సూరెన్స్ అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కాగా, బాధితులు పక్షాన పోరాడేందుకు కమిటీని ఏర్పాటుచేసి కన్వీనర్‌గా దొండపాటి నాగేశ్వరరావు, కోకన్వీనర్‌గా గువ్వల సీతారామిరెడ్డిని నియమించారు. ఈ సమావేశంలో సీపీఎం డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాలరావు, నాయకులు శీలం నరసింహారావు, మందా సైదులు, మందడపు ఉపేందర్, రైతులు పాల్గొన్నారు.
భట్రాజుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా పుల్లంరాజు
ఖమ్మంమామిళ్లగూడెం/ఖమ్మంఅర్బన్: భట్రాజుల సంఘం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఖమ్మంలో ఎన్నుకున్నారు. రాష్ట్ర ప్రతినిధులు ప్రతికంఠం దేవేందర్‌రాజు, ఆదూరి కళాధర్‌రాజు పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించగా అధ్యక్షుడిగా డాక్టర్ తోకచిచ్చు వెంకటపుల్లంరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే, ప్రధాన కార్యదర్శిగా సరికొండ రవికిరణ్‌రాజు, కోశాధికారిగా తంగెళ్ల వినోభారాజుతో పాటు మరో 18 మందితో కార్యవర్గాన్ని ప్రకటించారు. అంతేకాక, మహిళా విభాగం అధ్యక్షురాలిగా అంపోజ్వాలం అరుణాదేవి, కార్యదర్శిగా రాళ్లబండి నిర్మల, కోశాధికారిగా సరికొండ విజయలక్ష్మితో పాటు ఎనిమిది మంది సభ్యులను ఎన్నుకున్నారు. అంతేకాక యువజన విభాగం అధ్యక్షుడిగా ప్రతిగడప రవికిశోర్‌రాజు, కార్యదర్శిగా కోలాహలం రామరాజు, కోశాధికారిగా ఏలూరి నాగదిలీప్‌రాజుతో సహా మిగతా కార్యవర్గాన్ని ప్రకటించగా ప్రమాణ స్వీకారం చేశారు.
సాగర్ కాలువలో
వ్యక్తి గల్లంతు
కల్లూరు: కల్లూరు ఎన్నెస్పీ ప్రాంతానికి చెందిన కిరాణషాపు యజమాని తొర్రుకొండ వెంకటేశ్వర్లు(53) సాగర్ కాలువలో పడి గల్లంతయ్యాడు. గ్యాస్ సిలిండర్ తీసుకొస్తానని చెప్పి శనివారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిన ఆయన ఆదివారం కూడా తిరిగి రాలేదు. అనుమానంతో కాలువలో వెతకగా వెంకటేశ్వర్లు తీసుకెళ్లిన ద్విచక్ర వాహనం లభించింది. కానీ ఆయన ఆచూకీ లభించలేదు.


