కారేపల్లి: మండలంలోని గుట్టకిందిగుంపులో గంగదేవి గుట్టపై గోదాం నిర్మాణ ప్రదేశాన్ని గిడ్డంగుల సంస్థ ఎస్‌ఈ ఆర్.శ్రీనివాసరావు శుక్రవారం పరిశీలించారు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ జేసీబీలతో మట్టి తొలగించి బయటకు తరలిస్తుండడంతో ఇటీవల సర్పంచ్ రాఘవులుతో పాటు స్థానికులు అడ్డుకున్నారు. అంతేకాక గుట్టను ధ్వంసం చేయవద్దని ఆందోళన చేపట్టారు. ఈ మేరకు పనులు నిలిచిపోవడంతో ఎస్‌ఈ శ్రీనివాసరావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అయితే, గోదాం కోసం గుట్టను తొలగిస్తూ పర్యావరణాన్ని నాశనం చేయొద్దని కోరడమే కాక గ్రామపంచాయతీ పాలకవర్గ తీర్మానం లేకుండా పనులు చేపట్టారని స్థానికులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కాగా, నిర్మాణానికి కలెక్టర్ ఆదేశాలు ఉన్నాయని వెల్లడించిన ఎస్‌ఈ.. స్థానికుల అభ్యంతరాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. సింగరేణి సీఐ సాగర్, సర్పంచ్ ఉండం రాఘవులు, నాయకులు ఇమ్మడి తిరుపతిరావు, తొగర శ్రీను పాల్గొన్నారు.


