● పాండురంగాపురం–సారపాక మార్గానికి నిధులు శూన్యం ● 2026–27 కేంద్ర బడ్జెట్‌లో రైల్వే కేటాయింపుల వెల్లడి
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని పాండురంగాపురం–సారపాక రైల్వే లైన్‌కు కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదు. పైగా 174 కి.మీ కలిగిన ఈ లైనులో 125 కి.మీలను ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో చేర్చారు. కేంద్ర బడ్జెట్ 2026–27కు సంబంధించి రైల్వే పరమైన కేటాయింపుల వివరాలను శుక్రవారం రైల్వేశాఖ వెల్లడించింది. ఇందులో మల్కన్‌గిరి–పాండురంగాపురం వయా భద్రాచలం మార్గాన్ని ఈస్ట్‌కోస్ట్ రైల్వేజోన్ పరిధిలో చూపించింది. బడ్జెట్‌లో కేవలం రూ.3.13 కోట్లను కేటాయించారు. ఇవి కూడా ఒడిశాలోని మల్కన్‌గిరి సెక్షన్‌లోనే ఖర్చు పెట్టనున్నారు. ఈ మార్గం అందుబాటులోకి వచ్చినా ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఏపీల పరిధిలోకి వచ్చే 125 కి.మీ నిడివి కలిగిన ట్రాక్ ఈస్ట్ కోస్ట్ పరిధిలోకి వెళ్లనుంది. కేవలం తెలంగాణ పరిధిలో 49 కి.మీలు ఉండనుంది. ఇందులో సారపాక–పాండురంగాపురం సెక్షన్ పరిధి 14 కి.మీలను మినహాయిస్తే, భద్రాచలం స్టేషన్ నుంచి 35 కి.మీ పరిధి వరకు అంటే పాత భద్రాచలం మండలం పరిధి వరకే దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో ఉండనుంది. ఈ లైనుకు సంబంధించి బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదు.
కేటాయింపుల్లో స్పష్టత లేదు
జిల్లాకు సంబంధించి మణుగూరు–రామగుండం, కొత్తగూడెం–కిరండోల్, కొత్తగూడెం –కొండపల్లి, డోర్నకల్–భద్రాచలంరోడ్ డబ్లింగ్ పనులు ఎప్పుడో మంజూరయ్యాయి. నిర్మాణ పనులు పూర్తి కావడానికి కనీసం రూ.5 వేల కోట్లు అవసరమవుతాయి. అయితే, ఏ మార్గానికి ఎన్ని నిధులు కేటాయించారనే అంశాలపై రైల్వే శాఖ స్పష్టత ఇవ్వలేదు. ఈ మార్గాలకు సంబంధించి భూసేకరణ వివిధ దశల్లో ఉండగా, ఈ ప్రక్రియ పూర్తయితేనే పనులు మొదలయ్యే అవకాశం ఉంది. అందువల్లే బడ్జెట్‌లో కూడా మరోసారి ఫైనల్ లొకేషన్ సర్వే చేపడతామని సరిపెట్టారు. ఇక ఖమ్మం జిల్లాకు సంబంధించి కాజీపేట – విజయవాడ మార్గంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మూడో లైన్‌తోపాటు నాలుగో లైను నిర్మాణం కోసం సర్వే చేపట్టబోతున్నట్టు పేర్కొన్నారు.
జిల్లా ప్రజలకు నిరాశే..
కేంద్ర ప్రభుత్వం 2024 ఆగస్టులో గిరిజన ప్రాంతాల అభివృద్ధితోపాటు కోల్‌కతా–విజయవాడ–కాజీపేట సెక్షన్‌కు ప్రత్యామ్నాయ మార్గంగా అసన్‌సోల్–వరంగల్ రూట్‌లో నూతన మార్గాన్ని నిర్మిస్తామని పేర్కొంది. అందులో భాగంగా ఒడిశాలోని మల్కన్‌గిరి నుంచి భద్రాచలం మీదుగా పాండురంగాపురం వరకు 174 కి.మీ కొత్త మార్గాన్ని మంజూరు చేసింది. ఈ రైలు మార్గం ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఏపీ, తెలంగాణలలో నిర్మించాల్సి ఉంది. అయితే, ఈ లైనుకు సంబంధించి పాండురంగాపురం నుంచి సారపాక వరకు 14 కి.మీ మార్గాన్ని ముందుగా నిర్మించాలని తెలంగాణ సర్కార్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులందరూ కేంద్రానికి, రైల్వేశాఖకు వినతి పత్రాలు సమర్పించారు. కేవలం 14 కి.మీ ట్రాక్ నిర్మిస్తే సికింద్రాబాద్, విజయవాడ, నాగ్‌పూర్‌ల నుంచి నేరుగా భద్రాచలానికి రైల్వే కనెక్టివిటీ ఏర్పడుతుంది. దీంతో బడ్జెట్‌లో కేటాయింపులు జరుగుతాయని ఆశించగా, నిరాశే ఎదురైంది.


