వరదలొచ్చేలోగా వారధి ! | - | Sakshi
Sakshi News home page

వరదలొచ్చేలోగా వారధి !

Apr 4 2026 7:25 AM | Updated on Apr 4 2026 7:25 AM

వచ్చే వానాకాలంలోగా పూర్తిచేసేలా వేగం

ఖమ్మంఅర్బన్‌: ఖమ్మం జిల్లా కేంద్రానికి కొత్త అందాలను తీసుకొచ్చేలా మున్నేటిపై నిర్మిస్తున్న తీగల వంతెన పనుల్లో వేగం పెరిగింది. రూ.180 కోట్ల అంచనాతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ఇప్పటికే 70 శాతం పూర్తయింది. అగ్రిమెంట్‌ ప్రకారం మార్చి నెలలోనే బ్రిడ్జి నిర్మాణం పూర్తికావాల్సి ఉన్నా మున్నేటికి వచ్చిన వరదలో కొన్నాళ్లు పనులు నిలిచిపోయాయి. ఆ తర్వాత పనులు మొదలుపెట్టి వేగంగా చేయిస్తున్న అధికారులు వచ్చే వర్షాకాలం సీజన్‌కల్లా పూర్తిచేయాలనే లక్ష్యంతో ఉన్నారు. ఈ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే ఖమ్మంలోకి వాహనాల రాకపోకలు సులువు కావడంతో పాటు నగరం కొత్త అందాలు సంతరించుకోనుంది.

పురాతన బ్రిడ్జి స్థానంలో..

ఖమ్మంలో మున్నేటిపై ఏళ్ల క్రితం కాల్వొడ్డు ప్రాంతాన బ్రిడ్జి నిర్మించారు. ఈ బ్రిడ్జి చిన్నాపెద్ద వాహనాల రాకపోకలతో శిథిలావస్థకు చేరింది. అనంతరం ప్రకాశ్‌నగర్‌లో ఒకటి, కరుణగిరి వద్ద ఇంకో బ్రిడ్జి కూడా నిర్మించారు. కాగా, 2024లో మున్నేటికి వచ్చిన వరదల సమయాన కాల్వొడ్డు బ్రిడ్జి రాకపోకలకు అనువుగా లేదని తేల్చి అక్కడ కొత్త బ్రిడ్జిని ఆకట్టుకునేలా నిర్మించాలని నిర్ణయించారు. అలా అక్కడ తీగల వంతెన నిర్మాణానికి అడుగులు పడ్డాయి.

650 మీటర్ల పొడవుతో..

మున్నేటిపై కాల్వొడ్డులో ఉన్న పాత బ్రిడ్జికి ఆనుకుని 690 మీటర్ల పొడవైన తీగల వంతెనకు సంబంధించిన పిల్లర్లు, ఇతర అనుబంధ నిర్మాణాలు పూర్తిచేశారు. ఆపై తీగల అమరిక పనులు వేగంగా చేపడుతున్నారు. ఈ నెలాఖరుకు తీగల అమరికతో పాటు సెగ్మెంట్ల నిర్మాణం పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. ఆపై అప్రోచ్‌ రోడ్లు, ఇతర అనుబంధ పనులు పూర్తి చేసి సెప్టెంబర్‌ నాటికి వంతెనను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు సుమారు రూ.140 కోట్ల విలువైన పనులు పూర్తవగా, మిగిలిన పనులను దశలవారీగా పూర్తి చేసేలా నిత్యం పర్యవేక్షిస్తున్నారు. ఈ వంతెన అందుబాటులోకి వస్తే ఖమ్మంలో ట్రాఫిక్‌ సమస్యకు పరిష్కారం లభించడమే కాక నగరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

మున్నేటిపై చకచకా తీగల వంతెన పనులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement