వీడని చిక్కుముడులు | - | Sakshi
Sakshi News home page

వీడని చిక్కుముడులు

Apr 4 2026 7:25 AM | Updated on Apr 4 2026 7:25 AM

పర్యాటక సర్క్యూట్‌లో చేరిస్తే..

నేలకొండపల్లి బౌద్ధక్షేత్రం అభివృద్ధి, విమానాశ్రయం ఏర్పాటుపై నిర్లక్ష్యం

ఐదు గ్రామాలను తిరిగి విలీనం

చేయాలంటూ డిమాండ్‌

పార్లమెంట్‌లో గళం విప్పిన

ఎంపీలు రామసహాయం, వద్దిరాజు

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఉమ్మడి జిల్లా పరిధిలోని అనేక సమస్యల పరిష్కారానికి మోక్షం లభించడం లేదు. వీటిని పరిష్కరించే సమగ్రాభివృద్ధికి అవకాశం ఉన్నా ఆ దిశగా కేంద్రప్రభుత్వం కనీస ప్రయత్నం చేయడం లేదనే విమర్శలున్నాయి. ప్రధానంగా రాష్ట్ర విభజన సమయాన భద్రాచలం పట్టణాన్ని ఆనుకుని ఉన్న ఐదు గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేశారు. ఈ గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలనే డిమాండ్‌ నానాటికీ పెరుగుతోంది. ఇదికాక కొత్తగూడెం రైల్వేస్టేషన్‌ ఎదుట రహదారి విస్తరణకు భూమార్పిడి, కొత్తగూడెంలో ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణం, నేలకొండపల్లి బౌద్ధక్షేత్రం అభివృద్ధిపైనా చిక్కుముడులు వీడడం లేదు. వీటితో పలు సమస్యలను ఇప్పటికే ఎంపీలు రామసహాయం రఘురాంరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర పార్లమెంట్‌లో పలుమార్లు గళమెత్తినా కేంద్రం తన వైఖరి స్పష్టం చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

ఆ గ్రామాలను ఇచ్చేయండి..

రాష్ట్ర విభజన సమయాన ఆర్డినెన్స్‌ ద్వారా తెలంగాణ నుంచి ఐదు మండలాలను పూర్తిగానే కాక భద్రాచలం డివిజన్‌లోని మరికొన్ని గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి అప్పగించారు. ఇందులో ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు, పురుషోత్తపట్నం, గుండాల గ్రామాలు శ్రీసీతారామ చంద్రస్వామి కొలువైన భద్రాచలానికిఆనుకుని ఉన్నాయి. ఆలయ భూముల్లో చాలావరకు ఈ గ్రామాల్లోనే ఉండడం, ప్రస్తుతం రాష్ట్రప్రభుత్వం అభివృద్ధికి నిధులు కేటాయించినందున స్థలకొరత ఎదురుకాకుండా ఈ గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలనే డిమాండ్‌ పెరుగుతోంది. తద్వారా అక్కడి ప్రజల ఇబ్బందులు కూడా తీరుతాయని చెబుతున్నారు.

రైల్వే సమస్యలపై పట్టింపేదీ?

కొత్తగూడెం రైల్వేస్టేషన్‌ను ప్రారంభించి 2032 నాటికి వందేళ్లు పూర్తవుతాయి. అయినా స్టేషన్‌ ఆశించిన స్థాయిలో అభివృద్ధికి నోచుకోకపోగా.. తాజాగా కొత్తగూడెంను డివిజన్‌ కేంద్రంగా ప్రకటించాలని ప్రజల నుంచి డిమాండ్‌ ఉంది. అలాగే ఖమ్మం – కొత్తగూడెం – భద్రాచలం – బస్తర్‌ కారిడార్‌ను నాలుగు లేన్లుగా విస్తరిస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా రాష్ట్రాల మధ్య రవాణా వ్యవస్థను మరింత మెరుగుపడుతుంది. ఇదికాక భద్రాచలం రోడ్డు(కొత్తగూడెం), కొవ్వూరు రైల్వేలైన్‌కు నిధులు మంజూరు కాక దశాబ్దాలుగా ప్రతిపాదన దశ దాటడం లేదు. అంతేకాక కొత్తగూడెం స్టేషన్‌ ఎదుట ప్రధాన రహదారి విస్తరణకు 5,449 చదరపు గజాల రైల్వే భూమి అవసరమవుతోంది. ఇందుకు బదులు ఖమ్మం స్టేషన్‌ వద్ద 3,969.5 చ.మీటర్ల భూమి ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినా స్పందన లేదు. ఈ అంశాన్ని దక్షిణ మధ్య రైల్వే అధికారులు గత ఏడాది నవంబర్‌ 14న బోర్డుకు ప్రతిపాదించి ఎదురుచూస్తున్నారు.

ఈ సమస్యలు కూడా..

ఉమ్మడి జిల్లాలోని అపరిష్కృత సమస్యలను ఎంపీలు రామసహాయం రఘురాంరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర తరచుగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు. అంతేకాక లోక్‌సభ, రాజ్యసభల్లో ప్రస్తావిస్తున్నారు. పూర్వ ఖమ్మం జిల్లాలోని బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు, నవోదయ పాఠశాలలు, పాల్వంచలోని కేటీపీఎస్‌లో అదనంగా 825 మెగావాట్ల ప్లాంట్‌ ఏర్పాటుతో పాటు కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటు అంశంపై కూడా కేంద్రం వైఖరితో కలగానే మిగులుతోంది. గతంలో రెండు చోట్ల విమానాశ్రయానికి స్థలాలు పరిశీలించినా అక్కడ ఆచరణ సాధ్యం కాదని చెప్పడంతో అడుగు ముందుకు పడడం లేదు.

నేలకొండపల్లిలోని బౌద్ధక్షేత్రం దక్షిణ భారతదేశంలో ప్రధానమైనది. క్రీ.శ. 3, 4వ శతాబ్దాల్లో ఈ క్షేత్రం వికాసం సాధించినట్లు పురావస్తు పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ఇక్కడ తవ్వకాల్లో మహాస్తూపాలు, విహారాలు, ఇటుక నిర్మాణాలు, బుద్ధ విగ్రహాలు, రోమన్‌–భారతీయ నాణేలు వెలుగులోకి వచ్చాయి. ఈ వారసత్వ చరిత్రను భవిష్యత్‌ తరాలకు అందించేలా బౌద్ధ స్తూపాన్ని జాతీయ బౌద్ధ పర్యాటక సర్క్యూట్‌లో చేరిస్తే అభివృద్ధి సాధ్యమవుతుంది. ఇప్పటివరకు ఇక్కడ సరైన రహదారులు, సూచిక బోర్డులు లేకపోవడానికి తోడు సంరక్షణ లోపంతో నిర్మాణాలు దెబ్బతింటున్నాయి. ఇకనైనా సంరక్షణ చర్యలు చేపట్టడంతో పాటు మ్యూజియం, ఇంటర్‌ప్రిటేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి జాతీయ బౌద్ధ పర్యాటక సర్క్యూట్‌లో చేరిస్తే దేశ, విదేశీ పర్యాటకుల రాకతో స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి.

ఉమ్మడి జిల్లాను

వెంటాడుతున్న సమస్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement