ఖమ్మం స్పోర్ట్స్: రాష్ట్రంలోని స్పోర్ట్స్ స్కూళ్లలో ప్రవేశాలు కల్పించేందుకు ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో బుధవారం జిల్లాస్థాయి పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ మండలా ల నుంచి 63మంది బాలబాలికలు హాజరుకాగా, ఇందులో బాలురు 38, బాలికలు 25 మంది ఉన్నారు. వీరి ఎత్తు, బరువు కొలతలు వేయడంతో పాటు షటిల్ రన్, పరుగు పందెం తదితర పోటీలు నిర్వహించారు. ఈమేరకు బాలురు, బాలికలు పది మంది చొప్పున రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. వీరు ఈనెల 29వ తేదీన సికింద్రాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటార ని డీవైఎస్‌ఓ తుంబూరు సునీల్‌రెడ్డి తెలిపారు. ఎంపిక పోటీల్లో అథ్లెటిక్స్ కోచ్ ఎం.డీ.గౌస్, మేనేజర్ ఉదయ్‌కుమార్ పాల్గొన్నారు.
చికెన్ షాపులు బంద్
ఖమ్మంవ్యవసాయం: పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్లు తగ్గించాయని పేర్కొంటూ చికెన్ సెంటర్ల నిర్వాహకులు షాపులు బంద్ చేశారు. అసోసియేషన్ పిలుపుతో బుధవారం నుంచి ఉమ్మడి జిల్లాలోని 750 చికెన్ సెంటర్లు మూతపడ్డాయి. ఇదే సమయాన పౌల్ట్రీ కంపెనీల యాజమాన్యాలతో చికెన్ సెంటర్ల ఓనర్ల అసోసియేషన్ రాష్ట్ర బాధ్యులు చర్చలు ప్రారంభించారు. కాగా, సెంటర్ల బంద్‌తో ఉమ్మడి జిల్లాలో 120 టన్నుల చికెన్ క్రయవిక్రయాలు నిలిచిపోయాయని అంచనా. బంద్‌తో సెంటర్లపై ఆధారపడి జీవించే వారు ఇబ్బంది పడనున్నందున మార్జిన్ల తగ్గింపు చర్యలను ఉపసంహరించుకోవాలని అసోసియేషన్ ఖమ్మం అధ్యక్షుడు పారా సత్యనారాయణ కోరారు.
డీఏ బకాయిలు
విడుదల చేయండి
ఖమ్మంసహకారనగర్: సీపీఎస్ ఉద్యోగుల డీఏ బకాయిలు వెంటనే విడుదల చేయాలని టీఎస్ సీపీఎస్‌ఈయూ జిల్లా అధ్యక్షుడు చంద్రకంటి శశిధర్ డిమాండ్ చేశారు. డీఏ బకాయిల విడుదలతో పాటు పీఆర్సీ అమలుచేయాలనే డిమాండ్‌తో బుధవారం జిల్లావ్యాప్తంగా ఉద్యోగులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఖమ్మం ఆర్‌అండ్‌బీ కార్యాలయంలో జరిగిన నిరసనలో శశిధర్ మాట్లాడారు. సీపీఎస్ ఉద్యోగులకు డీఏల బకాయిలు వాయిదా రూపంలో కాకుండా ఏకమొత్తంలో చెల్లించాలన్నారు. అంతేకాక వెంటనే పీఆర్‌సీ నివేదిక తెప్పించుకుని అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ ఈయూ నాయకులు శ్వేత, రమణ, రవి, విజయ్, సాయి, కృష్ణభాను, శ్రీకాంత్, గోపి, కిరణ్, ఉదయ్, నరసింహారావు, వీర మహేష్, ప్రకాష్, సైదులు తదితరులు పాల్గొన్నారు.


