పెనుబల్లి: రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. పెనుబల్లికి చెందిన రేగళ్ల శ్రీరామ్ (21) శుక్రవారం ద్విచక్రవాహనంపై వెళ్తుండగా అదుపుతప్పి కిందపడడంతో తీవ్రగాయాలయ్యా యి. దీంతో పెనుబల్లిలో చికిత్స అనంతరం ఖమ్మం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతిచెందాడు. కాగా, నెలల క్రితమే శ్రీరామ్ తండ్రి కృష్ణ అనారోగ్యంతో మృతిచెందగా, ఇప్పుడు కుమారుడి మృతితో ఆయన తల్లి, కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు.
పాము కాటుతో మహిళ..
కొణిజర్ల: పాముకాటుతో మహిళ మృతిచెందిన ఘటన మండలంలోని క్రాంతినగర్ సమీపాన మంగళవారం చోటుచేసుకుంది. మృతురాలి బంధువులు, తోటి కూలీల కథనం ప్రకారం.. మండలంలోని అన్నవరం గ్రామానికి చెందిన బానోత్ వాలి (43) అదే గ్రామానికి చెందిన కూలీలతో కలిసి మండలంలోని క్రాంతినగర్ సమీపాన ఓ రైతు సాగు చేస్తున్న చేనులో కంకులు విరవడానికి వెళ్లింది. ఆమె పని చేస్తుండగా రక్త పింజర పాము కాటు వేయడంతో వాలి కేకలు వేస్తూ పడిపోయింది. దీంతో తోటి కూలీలు ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా, వాలికి భర్త చిన్న శ్రీనుతో పాటు ఇద్దరు కుమారులున్నారు.


