రాష్ట్ర
వయోజన విద్య
డిప్యూటీ
డైరెక్టర్ భాస్కర్
నేలకొండపల్లి: చదువు మధ్యలో మానేసిన వారితో పాటు పూర్తిగా నిరక్షరాస్యులకు కనీస విద్య నేర్పించడమే ‘అమ్మకు అక్షరమాల’ కార్యక్రమ లక్ష్యమని రాష్ట్ర వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్ భాస్కర్ తెలిపారు. మండలంలోని ఆరెగూడెం, ఆచార్లగూడెం, గువ్వలగూడెం గ్రామాల్లో ఆదివారం ఉల్లాస్ అభ్యాసకుల పరీక్ష సెంటర్లను ఆయన తనిఖీ చేసి మాట్లాడారు. ఖమ్మం జిల్లాలో 20 మండలాల్లో 29,922 మంది, భద్రాద్రి జిల్లాలోని 22మండలాల్లో 19,194 మంది అభ్యాసకులు ఉన్నారని తెలిపారు. వీరికి ఆదివారం పరీక్ష నిర్వహించామని పేర్కొన్నారు. 15 – 45 ఏళ్ల లోపు వయస్సు కలిగి చదువు మధ్యలో మానేసిన వారికి కనీస విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రూపొందించిందని తెలిపారు. ఓపెన్ స్కూల్ సొసైటీ జిల్లా కోఆర్డినేటర్ మంగపతి, నేలకొండపల్లి ఎంఈఓ బి.చలపతిరావు, ఐకేపీ కోఆర్డినేటర్లు సురేందర్, కోలేటి సుజాతతో పాటు సర్పంచ్‌లు పాల్గొన్నారు.


