ఖమ్మంఅర్బన్: ఖమ్మం 1వ డివిజన్ కై కొండాయిగూడెంలో ముత్యాలమ్మ తల్లి గుడి నిర్మాణానికి తుళ్లూరు మాధవరావు–కోటేశ్వరి దంపతులు 60 గజాల స్థలాన్ని విరాళంగా అందించారు. ఈ స్థలం విలువ రూ.6 లక్షలు ఉండగా, గ్రామస్తులు వారిని ఆదివారం అభినందించారు. కాగా, గ్రామంలో మే 11వ తేదీన శివాలయం వద్ద ధ్వజస్తంభం, బొడ్రాయి, ముత్యాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన జరగనుండగా, ఇందుకోసం రూ.40 లక్షల వ్యయంతో పనులు కొనసాగుతున్నాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగటి ఉపేందర్, మద్దినేని ప్రసాద్, తుళ్లూరు కృష్ణయ్య, నాగటి శ్రీనివాసరావు, గద్దల చిన్నప్ప, ఆళ్ల రమేష్, శీలం వీరబాబు, గిరిశాల రామారావు, పి.తిరుపతిరావు, భూక్యా ఉపేందర్ పాల్గొన్నారు.
రిటైర్డ్ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం
ఖమ్మం మామిళ్లగూడెం: ఏపీపీఎస్సీ గ్రూప్–4 ద్వారా 1984లో రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్లుగా ఎంపికై న పలువురు ఆతర్వాత పదోన్నతులతో వివిధ హోదాల్లో విధులు నిర్వర్తించి రిటైర్ అయ్యారు. ఈమేరకు వీరంతా ఆదివారం ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు. ఖమ్మంలో జరిగిన ఈ సమ్మేళనాన్ని టీఎన్జీవోస్ మాజీ అధ్యక్షుడు కూరపాటి రంగరాజు ప్రారంభించగా..వి.రాఘవాచార్యులు, సాంబశివరావు, గాలిశెట్టి వేణుగోపాల్, జి.సుదర్శన్‌రావు తదితరులు పాల్గొని మాట్లాడారు. విధుల్లో ఎదురైన అనుభవాలు, కుటుంబ వివరాలను పంచుకోవడమే కాక వయస్సును పక్కనపెట్టి ఆటపాటలతో ఉత్సాహంగా గడిపారు. ఈ సందర్భంగా జనార్ధన్, వి.కిషోర్, సత్యనారాయణ తమ పాటలతో అలరించారు.
‘పీఎం కుసుమ్ ’గడువు పొడిగింపు
ఖమ్మంగాంధీచౌక్: పీఎం కుసుమ్ పథకం ద్వారా సౌర విద్యుత్ ప్రాజెక్టుల గడువును పొడిగిస్తూ కేంద్ర నూతన, పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. బ్యాంకుల, ఆర్థిక సంస్థల నుంచి రుణాల మంజూరులో జాప్యం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈమేరకు ఫైనాన్షియల్ క్లోజర్ గడువును 2026 సెప్టెంబర్ 30 వరకు, ప్రాజెక్టు కమీషనింగ్ గడువును 2027 మార్చి 31 వరకు పొడిగించింది. అయితే, 2025 డిసెంబర్ 31 ముందు దరఖాస్తు చేసుకున్న ప్రాజెక్టులకే ఈ గడువు వర్తిస్తుందని వెల్లడించింది.


