కారేపల్లి: మద్యం మత్తులో ఉన్న డ్రైవర్... చిన్నారులను ఆటోలో ఎక్కించుకుని చక్కర్లు కొట్టడమే కాక చిన్నారిని ఆటో హ్యాండిల్ అప్పగించడంతో అదుపు తప్పి బోల్తా పడింది. కారేపల్లి మండలం పేరుపల్లికి చెందిన ఆటో డ్రైవర్ ఆదివారం మధ్యాహ్నం గ్రామంలో ఆడుకుంటున్న ఆరుగురు చిన్నారులను ఎక్కించుకొని జమాళ్లపల్లి రోడ్డు వైపు బయలుదేరాడు. ఈక్రమాన ముందు సీటులో తన పక్కన కూర్చున్న ఓ చిన్నారిని ఆటో నడపమని సూచిస్తూ హ్యాండిల్ అప్పగించాడు. దీంతో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో యశ్వంత్, స్నేహిత్, భరత్, తేజా, చింటు, ప్రవీణ్ గాయపడగా ప్రాథమిక చికిత్స అనంతరం యశ్వంత్, స్నేహిత్‌ను ఖమ్మం తరలించారు.
రోడ్డుప్రమాదంలో ఢీకొని యువకుడి మృతి
తిరుమలాయపాలెం: నడిచి వెళ్తున్న యువకుడిని గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మండలంలోని కొక్కిరేణి స్టేజీ సమీపాన ఆదివారం జరిగింది. మండలంలోని పాపాయిగూడెంకు చెందిన కందుకూరి ఈశ్వరి కుమారుడు శ్రీనివాస్(33) పెయింటింగ్ పనులతో జీవనం సాగిస్తున్నాడు. ఆయన ఆదివారం రాత్రి కొక్కిరేణి సమీపాన పెట్రోల్ బంక్ వద్ద నుంచి నడిచి వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో తల పూర్తిగా ఛిద్రమై అక్కడికక్కడే మృతిచెందాడు. ఆయన తండ్రి వెంకన్న చిన్నతనంలో మృతి చెందగా తల్లికి తోడుగా ఉంటున్నాడు. ఈమేరకు పోలీసులు ఇచ్చిన సమాచారంతో అన్నం సేవా ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు చేరుకుని మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు విచారణ చేపడుతున్నట్లు ఎస్‌ఐ కె.జగదీష్ తెలిపారు.
వడదెబ్బతో వ్యక్తి..
ఖమ్మంక్రైం: మండుతున్న ఎండలతో వడదెబ్బ బారిన పడిన ఓ ఓ వ్యక్తి మృతి చెందాడు. కొణిజర్ల మండలం బస్వాపురానికి చెందిన ఉపేందర్(31) ఖమ్మం ఎన్టీఆర్ సర్కిల్‌లోని కొబ్బరి బోండాల షాప్‌లో పనిచేస్తున్నాడు. ఎండల కారణంగా తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను ఆదివారం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఖమ్మం టూటౌన్ సీఐ బాలకృష్ణ తెలిపారు.


