పట్టువస్త్రాలను
సమర్పించిన గవర్నర్
కనుల పండువగా
రామయ్య పట్టాభిషేకం
రాజదండం, రాజముద్రిక,
ఖడ్గాలకు పూజలు
పట్టువస్త్రాలను సమర్పించిన
గవర్నర్ శివప్రతాప్ శుక్లా
భక్తిభావంతో ఉప్పొంగిన భద్రగిరి
ఖమ్మం
దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచల దివ్యక్షేత్రంలో శనివారం రామయ్య పట్టాభిషేక మహోత్సవం వైభవోపేతంగా జరిగింది. పంచారాత్ర ఆగమ శాస్త్రాలను అనుసరిస్తూ వేడుక నిర్వహించగా, రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రభుత్వం తరఫున శ్రీరాముడికి పట్టువస్త్రాలను సమర్పించారు. రాజాధిరాజుగా కొలువుదీరిన స్వామివారిని వీక్షించి భక్తులు తరించారు.
I
ఆదివారం శ్రీ 29 శ్రీ మార్చి శ్రీ 2026
భద్రాచలం: సీత, లక్ష్మణ సమేతుడైన శ్రీరాముడిని ప్రధాన ఆలయం నుంచి మాడ వీధులు గుండా మిథిలా స్టేడియానికి తీసుకొచ్చారు. విశ్వక్సేన, పుణ్యావాచనం చేశాక, పండితులు రుత్విక్కులైన వశిష్టుడు, వామదేవుడు, జాబాలి, కశ్యపుడు, కాత్యాయనుడు, గౌతముడిని తమపై ఆవాహన చేసుకున్నారు. రుత్వికరణం తర్వాత పండితులు మండపత్ర పూజలు ప్రారంభించారు. పట్టాభిషేకం వేదిక దిగువ భాగంలో ఏర్పాటు చేసిన మూడు కలశాల్లో సమస్త దేవతలు, సమస్త నదీ, సముద్ర జలాలతో పాటు రామపరివారాన్ని, అష్టదిక్పాలకులను ఆవాహన చేశారు. అనంతరం స్వామివారికి అష్టోత్తర శతనామార్చన చేశారు. ఆపై త్రిదండి దేవనామ రామానుజాచార్యులు శ్రీరాముడి పాలన విశిష్టతను వివరించారు.
రాజ లాంఛనాలతో..
రాజలాంఛనాలతో పట్టాభిషేక అలంకరణ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైంది. ముందుగా రాజదండాన్ని శ్రీరాముడి కుడిచేతిలో ఉంచారు. అనంతరం రాజముద్రికను తొడిగారు. ఆ తర్వాత రామదాసు చేయించిన పచ్చల పతకాన్ని శ్రీరాముడికి, చింతాకు పతకాన్ని సీతాదేవికి, రామమాడను లక్ష్మణుడికి అలంకరించారు. శ్రీరాముడికి ఇరువైపులా చామరాలను ఉంచారు. ఆపై స్వర్ణఛత్రాన్ని స్థిరం చేశారు. చివరగా రాజఖడ్గాన్ని రామయ్య ఎడమ చేతిలో ధరింప చేశారు. ఆ తర్వాత రుత్విక్కులు పట్టాభిషేకం కార్యక్రమాన్ని ప్రారంభించారు. మండపత్రయంలోని మూడు కలశాల్లోని సమస్త దేవతలు, సమస్త జలాలు, రామపరివారంతో కూడిన మంత్రించిన జలాన్ని శ్రీరాముడిపై ప్రోక్షణ చేశారు. మంగళహారతితో పట్టాభిషేక తంతు ముగిసింది. పట్టాభిషేకం అనంతరం సీతమ్మవారు ఆంజనేయుడి మెడలో ముత్యాల దండ ధరింపచేస్తూ
ఆంజనేయ పట్టాభిషేకాన్ని చేశారు. వేడుకగా పట్టాభిషిక్తుడైన రాముడిని పల్లకీలో ప్రధాన ఆలయానికి తీసుకెళ్లారు.
రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా సారపాకలోని ఐటీసీ ప్రాంగణానికి చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా నేరుగా ప్రధాన ఆలయానికి చేరుకుని దర్శనం చేసుకున్నారు. అనంతరం పట్టాభిషేకం జరిగే మిథిలా స్టేడియానికి చేరుకుని సతీ సమేతంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివా రికి పట్టువస్త్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాంనాయక్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్‌రాజు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
రథోత్సవంలో దర్జాగా రామయ్య
పట్టాభిషేకం జరుపుకున్న సీతాలక్ష్మణ సమేతుడైన రామయ్య శనివారం రథంలో విహరించారు. ప్రత్యేకంగా అలంకరించిన స్వామి వారి ఉత్సవ మూర్తులను రథంలో కొలువుదీర్చా రు. భక్తుల జయజయధ్వానాలు, శ్రీరామనామస్మరణల నడుమ తాతగుడి సెంటర్ వరకు వేడుక జరిపారు. ఇళ్లముందుకు వచ్చిన స్వామివారికి భక్తులు హారతులతో స్వాగతం పలికిమొక్కులను తీర్చుకున్నారు. ‘రథస్థం రాఘవందృష్ట్యా పునర్జన్మ నవి ద్యతే’ అని బ్రహ్మ పురాణం చెబుతోందని, రథోత్సవంలో శ్రీ రాముని సేవించిన వారికి ముక్తి లభిస్తుందని స్థల పురాణం చెబుతోందని అర్చకులు వివరించారు.


