ఖమ్మంమయూరిసెంటర్: పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం దేశంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోందని, ఫలితంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు తెలిపారు. కేంద్రం ఆయిల్ ధరలను తగ్గించినా సామాన్యులకు మేలు జరగదని చెప్పారు. ఖమ్మం గిరిప్రసాద్‌భవన్‌లో శనివారం సీపీఐ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. యుద్ధం నేపథ్యాన ముందస్తు చర్యలు చేపట్టడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందన్నారు. యాసంగి చివరి దశలోనూ రైతు భరోసాగా ఒక ఎకరానికే నిధులు జమ చేసిన రాష్ట్ర ప్రభుత్వ తీరు సరికాదని పేర్కొన్నారు. పార్టీ శ్రేణులు శాఖల నిర్మాణం, ప్రజాసమస్యలపై పోరాటాలకు సిద్ధం కావాలని సూచించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేశ్, నాయకులు మహ్మద్ మౌలానా, జమ్ముల జితేందర్‌రెడ్డి, జాగర్లమూడి రంజిత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ నాయకుడు బాగం హేమంతరావు


