వైరా: జిల్లాలో రైతులు సాగు చేస్తున్న పంటలు చివరి దశలో ఉన్నందున ఏప్రిల్ చివరి వరకు సాగర్ జలాలు విడుదల చేయాలని తెలంగాణ రైతు సంఘఽం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్ డిమాండ్ చేశారు. వైరాలోని సీపీఎం కార్యాలయంలో శనివారం జరిగిన సంఘం జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పలు మండలాల్లో వరి పంట సాగవుతున్నందున ఏప్రిల్ చివరి వారం వరకు నీటి తడులు అవసరమవుతాయని తెలిపారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని నీటి విడుదల కొనసాగించాలన్నారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో సాదాబైనామా దరఖాస్తులను తక్షణమే పరిష్కరించి పట్టాలు ఇవ్వాలని, మక్కల కొనుగోలుకు మార్క్‌ఫెడ్ కేంద్రాలు ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు మాట్లాడగా, నాయకులు వాసిరెడ్డి ప్రసాద్, తాతా భాస్కరరావు, దుగ్గి కృష్ణ, రచ్చా నరసింహారావు, ఎస్‌కే.మీరా, బండి రమేష్, బిక్కసారి గంగాధర్, గొడవర్తి నాగేశ్వరరావు, శీలం ఫకీరమ్మ, దొండపాటి నాగేశ్వరరావు, రావుల రాజబాబు, గుడ్డూరి ఉమ, మల్లెంపాటి రామారావు, బాణాల శ్రీనివాసరావు పాల్గొన్నారు.


