ఖమ్మం లీగల్: పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్ చక్కని వేదికగా నిలుస్తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్ తెలిపారు. కాలయాపన లేని సత్వర పరిష్కారం, అప్పీలు లేని తుదితీర్పు లభిస్తుందని వెల్లడించారు. ఖమ్మం న్యాయ సేవాసదన్‌లో శనివారం నిర్వహించిన లోక్ అదాలత్‌ను జిల్లా జడ్జి ప్రారంభించి మాట్లాడారు. రాజీ మార్గంలో ఎలాంటి ఫీజు లేకుండా న్యాయసేవాసంస్థ సహకారంతో కేసులు పరిష్కారమవుతాయని తెలిపారు. తద్వారాకోర్టు చుట్టూ తిరిగి సమయం, డబ్బు ఆదా కావడమే కాక మానసిక ప్రశాంతత లభిస్తుందని పేర్కొన్నారు. అంతేకాక ఇక్కడ ఇచ్చిన తీర్పుపై అప్పీల్ ఉండదని చెప్పారు. గత లోక్ అదాలత్‌లో 8,490 కేసులు పరిష్కరించి జిల్లా రాష్ట్రంలో ఆరో స్థానంలో నిలవగా, 63 మోటారు వాహన ప్రమాద కేసులను పరిష్క రించడం ద్వారా రూ.4,28,98,000 పరిహారం అందించామని తెలిపారు. అనంతరం బార్ కౌన్సిల్ మెంబర్ మందడపు శ్రీనివాసరావు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తొండపు వెంకటేశ్వరరావు మాట్లాడగా, రాజీ పడిన మూడు కేసుల్లో కక్షిదారులు, ప్యానల్ న్యాయవాదులకు జిల్లా జడ్జి మొక్కలు అందజేశారు. న్యాయ సేవా సంస్థ కార్యదర్శి కల్పన అధ్యక్షతన లోక్ అదాలత్ నిర్వహించగా వివిధ కోర్టుల న్యాయమూర్తులు ఉమాదేవి, అర్చన కుమారి, రాంప్రసాదరావు, సీనయ్య, శివరంజని, దీప, రజిని, బిందుప్రియ, అఖిల, నాగలత, పీపీ శంకర్, న్యాయవాదులు గంగాధర్, హరిందర్‌రెడ్డి, సీతారామారావు, స్వర్ణ రాంబాబుతో పాటు బార్ అసోసియేషన్ కార్యదర్శి దిలీప్ తదితరులు పాల్గొన్నారు.
6,500 కేసుల పరిష్కారం
జిల్లాలోని కోర్టుల్లో నిర్వహించిన లోక్ అదాలత్‌లో 6,500 కేసులను పరిష్కరించినట్లు జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి ఎం.కల్పన తెలిపారు. ఇందులో క్రిమినల్ కేసులు 2,730, సివిల్ కేసులు 37, చెక్‌బౌన్స్ కేసులు 48, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 3,544తో ఇతర కేసులు ఉన్నాయని వెల్లడించారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్


