ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాలు శనివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా యాగశాలలో ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ ఆధ్వర్యాన మహా పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం ఉత్సవాల ముగింపు సూచికగా ధ్వజ పతాకాన్ని అవనతం చేశారు. అలాగే, ఆలయ ప్రాంగణంలోని పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించారు. ఆలయ ఈఓ జగన్మోహన్‌రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, శ్రీరామచంద్రమూర్తి, పుష్కరిణి నిర్మాణ దాత గుదే వెంకటేశ్వరరావు దంపతులు, ఉద్యోగులు సోమయ్య, కృష్ణప్రసాద్, ముఖ్య అర్చకులు మురళీమోహన్‌శర్మ, రాజీవ్‌శర్మ పాల్గొన్నారు.
మత్కేపల్లి మార్కెట్
అభివృద్ధికి రూ.8 కోట్లు
నేలకొండపల్లి: జిల్లాలోని మత్కేపల్లి వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి రూ.8కోట్లు కేటా యించనున్నట్లు జిల్లా మార్కెటింగ్ అధికారి ఎం.ఏ.అలీం తెలిపారు. ఇందుకోసం ఖమ్మం మార్కెట్ నుంచి రూ.7 కోట్లు, నేలకొండపల్లి నుంచి రూ.కోటి అందించేలా ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. నేలకొండపల్లి మార్కెట్‌ను శనివారం తనిఖీ చేసిన ఆయన మాట్లాడారు. జిల్లాలోని మార్కెట్ల ద్వారా ఈ ఏడాది ఇప్పటివరకు రూ.45.07 కోట్ల ఆదాయం సమకూరిందని తెలిపారు. అలాగే, 21 చెక్‌పోస్టుల ద్వారా రూ.69.50 కోట్లకు గాను రూ.45.07 కోట్లు వసూలు చేసినట్లు చెప్పారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి సివిల్ సప్లయీస్ శాఖ నుంచి రూ.3.92 కోట్లు, ప్రైవేట్‌గా రూ.3 కోట్లు రావాల్సి ఉందని డీఏఓ తెలిపారు.


