ఎర్రుపాలెం: మండలంలోని జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలోని వకుళామాత స్టేడియంలో శుక్రవారం శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణం వైభవంగా సాగింది. తొలుత యాగశాల నుంచి కల్యాణమూర్తులను అర్చకులు, అధికారులు పల్లకీలో కల్యాణ మండపానికి తోడ్కొని వచ్చారు. అనంతరం ప్రత్యేక పూజల అనంతరం భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి ఆలయం నుంచి వచ్చిన ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలను ఈఓ జగన్మోహన్‌రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ దంపతులు సమర్పించారు. అనంతరం కల్యాణ వేడుకను పురాణం రవికుమార్‌శర్మ నిర్వహించగా, వ్యాఖ్యాతగా ఆలయ ప్రధాన అర్చకుడు ఉప్పల శ్రీనివాసశర్మ వ్యవహరించారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో హాజరైన భక్తులు కల్యాణోత్సవాన్ని తిలకించారు. అనంతరం భక్తులకు పానకం, ప్రసాదం పంపిణీ చేయడమే కాక అన్నదానం నిర్వహించారు. ఆతర్వాత స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను గ్రామంలో హనుత్ వాహనంపై ఊరేగింపు చేశారు. సర్పంచ్ తుళ్లూరు నిర్మల, సొసైటీ మాజీ చైర్మన్ ముల్పూరి శ్రీనివాసరావు, అర్చకులు మురళీమోహన్‌శర్మ, రాజీవ్‌శర్మ, సిబ్బంది పాల్గొన్నారు.


