● మద్దతు ధర దక్కక ఆందోళన ● ప్రభుత్వ కొనుగోళ్లు లేక వ్యాపారుల ఇష్టారాజ్యం ● క్వింటాకు రూ.1,500కు పైగా నష్టం
ఖమ్మంవ్యవసాయం: యాసంగిలో పెసర పంట సాగు చేసిన రైతులకు మద్దతు ధర దక్కడం లేదు. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం పెసలు క్వింటాకు రూ.8,682గా మద్దతు ధర నిర్ణయించింది. ప్రస్తుతం యాసంగిలో సాగు చేసిన పెసర పంట చేతికి వస్తుండగా, కొందరు రైతులు విక్రయాలు సాగిస్తున్నారు. ప్రభుత్వపరంగా కొనుగోళ్లు లేకపోవడంతో వ్యాపారులు గరిష్టంగా రూ.7,600 మించి చెల్లించడంలేదు. నాణ్యత తక్కువగా ఉంటే రూ.5వేలుగా ధర నిర్ణయిస్తుండడంతో రైతులకు నష్టం ఎదురవుతోంది.
తగ్గిన సాగు
ఈ ఏడాది జిల్లాలో యాసంగి పంటగా పెసరను రైతులు 5వేల ఎకరాల్లో సాగు చేశారు. గతంతో పోలిస్తే ఇది చాలా తక్కువ సాధారణంగా యాసంగిలో సుమారు 20 వేల ఎకరాల వరకు సాగు చేస్తారు. కానీ పెసరతో పోలిస్తే మొక్కజొన్నతో అధిక ఆదాయం ఉండడం, నీటి వనరులు పెరగడంతో రైతులు అటే మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా పెసర విస్తీర్ణం తగ్గింది. ఈ ఏడాది పెసర ఎకరాకు 5 – 6 క్వింటాళ్ల మేర దిగుబడి రాగా, మద్దతు ధర లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
డిమాండ్ ఉన్నప్పటికీ...
పెసల కొనుగోళ్లలో వ్యాపారులు నిర్ణయించిందే ధర అన్నట్టు సాగుతోంది. కేంద్రప్రభుత్వం క్వింటాకు రూ.8,682గా మద్దతు ధర నిర్ణయించినా ఎక్కడా అమలు కావడం లేదు. ప్రభుత్వ కొనుగోళ్లు లేకపోవడంతో వ్యాపారులు క్వింటా రూ.5వేల నుంచి రూ.6,500 లోపే కొనుగోలు చేస్తున్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో రూ.5,500 నుంచి రూ.7,600 వరకు ధర పలుకుతోంది. పంటకు డిమాండ్ ఉన్నా వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి ధర తగ్గిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
నాణ్యత లేదంటూ కోత
పంట నాణ్యతగా ఉన్నా మద్దతు ధరతో పోలిస్తే క్వింటాకు రూ.1,500పైగా రైతులు నష్టపోతున్నారు. ఇక నాణ్యత లేని పంటకు రూ.5,500 మించి చెల్లించడం లేదు. మూడేళ్ల క్రితం వరకు నాఫెడ్ సహకారంతో మార్క్‌ఫెడ్ పెసలను కొనుగోలు చేసింది. ప్రస్తుతం కూడా ప్రభుత్వం రంగంలోకి దిగితే తప్ప రైతులకు న్యాయం జరిగే అవకాశం కనిపించడం లేదు.


