సత్తుపల్లి: సత్తుపల్లి ఓసీల నుంచి బొగ్గు రవాణాలో అంతరాయం ఎదురుకాకుండా పర్యవేక్షిస్తున్నామని దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజనల్ మేనేజర్ డాక్టర్ ఆర్.గోపాల్‌కృష్ణన్ తెలిపారు. ఈమేరకు బుధవారం ఆయన సత్తుపల్లి జేవీఆర్‌బీ సైడింగ్, సిగ్నలింగ్, ట్రాఫిక్ సిస్టమ్‌తో పాటు సిబ్బంది రన్నింగ్ రూంలోని వసతులను పరిశీలించారు. అంతేకాక సత్తుపల్లి సీహెచ్‌పీ వద్ద రైల్వే వ్యాగన్లలో బొగ్గులోడింగ్‌ను సింగరేణి జీఎం చింతల శ్రీనివాస్‌తో కలిసి పరిశీలించి వివరాలు ఆరాతీశారు. అనంతరం రైల్వే, సింగరేణి అధికారులతో సమావేశమైన డీఆర్‌ఎం వ్యాగన్ల కేటాయింపు, లోడింగ్, బొగ్గురవాణాపై సమీక్షించారు. సింగరేణి అధికారులు బొల్లం శ్రీనివాస్, ప్రహ్లాద్, సోమశేఖర్‌రావు, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
కారేపల్లిలో ఆగకుండానే...
కారేపల్లి: కారేపల్లి రైల్వేస్టేషన్ విస్తరణ పనులను డీఆర్‌ఎం ఆర్.గోపాలకృష్ణన్ బుధవారం పరిశీలిస్తారని, ఇందులో భాగంగా అధికారులు ప్రత్యేక రైలులో వచ్చిన ఆయన కొత్తగూడెం స్టేషన్‌లో పరిశీలన తర్వాత కారేపల్లి స్టేషన్‌కు వస్తారని అధికారులు వెల్లడించారు. దీంతో డబ్లింగ్ లైన్ నిర్వాసితులతో పాటు ఇతర సమస్యలపై డీఆర్‌ఎంకు వినతిపత్రం ఇవ్వాలని సింగరేణి సర్పంచ్ టోనీవీరప్రతాప్, గ్రామస్తులు మధ్యాహ్నం 3గంటల నుంచి స్టేషన్‌లో వేచి ఉన్నారు. కానీ సాయంత్రం 4గంటల సమయాన డీఆర్‌ఎం ఉన్న రైలు కారేపల్లి స్టేషన్‌లో ఆగకుండానే డోర్నకల్ వైపునకు వెళ్లిపోవడంతో స్థానికులు నిరాశ చెందారు.
సొమ్ము స్వాహాపై విచారణ
కారేపల్లి: సింగరేణి మండలంలోని మోట్లగూడెం, మాధారం, పేరుపల్లి, గుట్టకిందిగుంపు, చీమలపాడు, భాగ్యనగర్‌తండా గ్రామాల్లో మహిళా సంఘాల సభ్యులకు సంబంధించి బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి రుణాల్లో అవకతవకలు జరిగాయని అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో బుధవారం కారేపల్లి ఐకేపీ కార్యాలయంలో అడిషనల్ డీఆర్‌డీఓ జయశ్రీ ఆధ్వర్యాన విచారణ చేపట్టారు. తొలుత సుమారు రూ.12లక్షల మేర అవకతవకాలు జరిగాయనే ఆరోపణలతో మోట్లగూడెంలో వీఓలను విచారించారు. మిగతా గ్రామాల్లోనూ సీ్త్రనిధి పెండింగ్ నగదు వసూలు చేసి ఖాతాలో జమ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. వారం తర్వాత పూర్తిస్థాయి విచారణ చేపడుతామని తెలిపారు. ఈ విచారణలో డీపీఎం ఆంజనేయులు, సీ్త్రనిధి ఆర్‌ఎం రవీందర్‌నాయక్, మండల పరిషత్ సూపరింటెండెంట్ రమేష్, ఏపీఎం పి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
సుపరిపాలనలో వార్డుసభ్యులే కీలకం
తల్లాడ: గ్రామాల్లో ప్రజలకు సుపరిపాలన అందాలంటే వార్డుసభ్యులు కీలకంగా వ్యవహరించాలని జిల్లా పంచాయతీ అధికారి టి.రాంబాబు సూచించారు. తల్లాడ రైతు వేదికలో వార్డు సభ్యులకు బుధవారం ఏర్పాటుచేసిన శిక్షణలో ఆయన మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలుచేయడంలో సర్పంచ్‌లు, గ్రామ కార్యదర్శులకు సహకరించాలని తెలిపారు. పారిశుద్ధ్య పనులు, తాగునీటి సరఫరా, ఇతర సమస్యల పరిష్కారంలో కీలకంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. ఎంపీడీఓ శ్రీధర్‌రాజు, ఎంపీఓ సురేష్‌బాబుతో పాటు ఉద్యోగులు పరశురామ్, కృష్ణారావు పాల్గొన్నారు.


