వ్యాలిడేషన్‌ చట్టాన్ని రద్దు చేయాలి | - | Sakshi
Sakshi News home page

వ్యాలిడేషన్‌ చట్టాన్ని రద్దు చేయాలి

Mar 26 2026 7:28 AM | Updated on Mar 26 2026 7:28 AM

ఖమ్మం సహకారనగర్‌: గత ఏడాది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యాలిడేషన్‌ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం(ఎస్‌జీపీఏటీ) రాష్ట్ర కార్యదర్శి మేరి ఏసుపాదం డిమాండ్‌ చేశారు. ఈ చట్టం ద్వారా పెన్షనర్ల విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. ఈమేరకు బుధవారం బ్లాక్‌ డేగా పాటిస్తూ కలెక్టరేట్‌ ఎదుట చేపట్టిన నిరసనలో ఆమె జిల్లా అధ్యక్షుడు పరిశ పుల్లయ్యతో కలిసి మాట్లాడారు. ఇప్పటికే నూతన పెన్షన స్కీమ్‌, ఓల్డ్‌ పెన్షన్‌ స్కీమ్‌ పేరుతో ఉద్యోగుల ఐక్యతను దెబ్బతీసిన కేంద్రప్రభుత్వం పెన్షనర్ల మధ్య కూడా చిచ్చుపెట్టే కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఈమేరకు వ్యాలిడేషన్‌ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం కలెక్టరేట్‌ ఏఓ కె.శ్రీనివాసరావుకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు రాయల రవికుమార్‌, గుర్రాల శ్రీనివాసరావు, పెదమళ్ల సత్యనారాయణ, ఊడుగు వెంకటేశ్వర్లు, జల్లా వెంకటేశ్వర్లు, తాడి అంజలి పాల్గొన్నారు.

పండితాపురం సంతలో కత్తితో దాడి

కామేపల్లి: మండలంలోని పండితాపురం సంతలో ఓ వ్యక్తి నిర్వాహకులపై కత్తితో దాడిచేశాడు. ఏపీ రాష్ట్రంలోని వత్సవాయికి చెందిన మటన్‌ వ్యాపారులు షేక్‌ మస్తాన్‌వలీ, నాగసైదులు సంతలో ఐదు మేకపోతులను కొనుగోలు చేశారు. అయితే, రుసుము నాలుగింటికే చెల్లించి తీసుకెళ్తుండగా నిర్వాహకులు అడ్డుకున్నారు. దీంతో వ్యాపారులు కత్తితో దాడిచేయగా బాదావత్‌ నాగరాజు, బోడాలక్ష్మాకు తీవ్రగాయాలయ్యాయి. అలాగే, శీలం నాగేశ్వరరావు, బండిఉపేందర్‌కు గాయాలు కాగా, మరికొందరిపైనా దాడిచేసేందుకు వెళ్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. ఈమేరకు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీకాంత్‌ తెలిపారు.

మహిళ మెడలో బంగారు గొలుసు చోరీ

బోనకల్‌: మండలంలోని రావినూతలలో బుధవారం ఓ మహిళ మెడలో బంగారు గొలుసు చోరీ అయింది. గ్రామానికి చెందిన షేక్‌ బేగం పాల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తోంది. బుధవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తి ఆమె ఇంటి తలుపు కొట్టగా స్థానికులు పాల కోసం వచ్చారని ఆమె తెరిచింది. దీంతో సదరు వ్యక్తి ఆమె మెడలో బంగారు గొలుసు లాక్కుని పారిపోయాడు. ఘటనపై బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పొదిలి వెంకన్న తెలిపారు.

హజ్‌ యాత్రికులకు వ్యాక్సిన్‌

ఖమ్మంవైద్యవిభాగం: హజ్‌ యాత్రకు ఎంపికై న వారికి ఖమ్మం జనరల్‌ ఆస్పత్రిలో బుధవారం వ్యాక్సినేషన్‌ నిర్వహించారు. ఆస్పత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ ఎం.నరేందర్‌ ఆధ్వర్యాన 58 మంది యాత్రికులకు పరీక్షలు నిర్వహించి మెదడువాపు, ఫ్లూ జ్వరం నుంచి రక్షణ కోసం వ్యాక్సిన్లు వేశారు. డీఐఓ ప్రదీప్‌, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ వేణుమాదవ్‌, ఆర్‌ఎంఓ రాజేంద్రప్రసాద్‌, వైద్యులు శ్రీకాంత్‌, రాంప్రసాద్‌, నివేదిత, శ్యామల, ఉద్యోగులు రమణ, డీ నాగరాజు, వేణుగోపాల్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement