వైభవంగా శ్రీవారి కల్యాణం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా శ్రీవారి కల్యాణం

Mar 26 2026 7:27 AM | Updated on Mar 26 2026 7:27 AM

ఎర్రుపాలెం: జమలాపురంలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈమేరకు బుధవారం శ్రీవేంకటేశ్వరస్వామి సమేత అలివేలు మంగ, పద్మావతి కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. తొలుత భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం నుంచి తీసుకొచ్చిన ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలను ఆలయ ఈఓ జగన్మోహన్‌రావు దంపతులు, గ్రామపంచాయతీ తరపున సర్పంచ్‌ తుళ్లూరు నిర్మలకుమారి–కోటేశ్వరరావు దంపతులు సమర్పించారు. అనంతరం ఉప్పల విజయదేవశర్మ దంపతులతో ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, ముఖ్య అర్చకులు మురళీమోహన్‌శర్మ, రాజీవ్‌శర్మ కల్యాణ క్రతువు చేయించారు. ఆ తర్వాత గ్రామ పెద్ద చెరువులో శ్రీవారి తెప్పోత్సవం నిర్వహించారు. ఆలయ ఽవ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, మార్కెట్‌ చైర్మన్‌ బండారు నర్సింహారావు, మాజీ జెడ్పీటీసీ అంకసాల శ్రీనివాసరావు, మాజీ సొసైటీ చైర్మన్‌ ముల్పూరి శ్రీనివాసరావు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

నేడు బార్‌ అసోసియేషన్‌ ఎన్నికలు

ఖమ్మంలీగల్‌: 2026–27 ఏడాదికి గాను జిల్లా బార్‌ అసోసియేషన్‌ ఎన్నికలు గురువారం జరగనున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ సమయానికి అధ్యక్ష, కార్యదర్శులు తప్ప మిగిలిన పోస్టులన్నీ ఏకగ్రీవమయ్యాయి. ఈమేరకు అధ్యక్ష పదవికి మోజెస్‌ క్రిస్టోఫర్‌, యడ్లపల్లి రమేష్‌, వెంకటేశ్వరరావు గుప్తా, విజయరాఘవ, కార్యదర్శి పదవికి కందుల అమరనాధ్‌, కొప్పుల రవికుమార్‌, తాళ్ల వెంకట నారాయణ పోటీలో ఉన్నారు. కాగా, 980మంది న్యాయవాదులు ఓటు హక్కు వినియోగించుకోనుండగా, గురువారం ఉదయం 10నుంచి సాయంత్రం 4–30గంటల వరకు పోలింగ్‌ జరగనుందని ఎన్నికల అధికారులు పీఏజే.శేఖర్‌రాజ్‌, ఎంఏ.తౌఫిక్‌, ఎం.శ్రీనివాసరావు, పి.వెంకన్న తెలిపారు. బార్‌ అసోసియేషన్‌ హాల్‌లో జరిగే పోలింగ్‌కు ఓటర్లు గుర్తింపు కార్డుతో హాజరుకావాలని సూచించారు.

ప్రభుత్వ కేంద్రాల్లోనే మద్దతు ధర

చింతకాని: ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ ద్వారా ఏర్పాటుచేసిన కేంద్రాల్లోనే మొక్కజొన్నలకు మద్దతు ధర లభిస్తుందని జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య తెలిపారు. మండలంలోని తిమ్మినేనిపాలెం, తిరుమలాపురంల్లో బుధవారం ఆయన మొక్కజొన్న పంటను పరిశీలించి మాట్లాడారు. మార్క్‌ఫెడ్‌ ద్వారా ఏర్పాటుచేసే కేంద్రాలకు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా మొక్కజొన్నలు తీసుకొస్తే మద్దతు ధర దక్కుతుందని తెలిపారు. అంతేతప్ప ప్రైవేట్‌ వ్యాపారులకు అమ్ముకుని నష్టపోవద్దని సూచించారు. సర్పంచ్‌ చాపలమడుగు వీరబాబు, ఏఈఓ కార్తీక్‌, రైతులు పాల్గొన్నారు.

2వ తేదీ వరకు

దరఖాస్తు అవకాశం

ఖమ్మం సహకారనగర్‌: జిల్లాలోని షెడ్యూల్డ్‌ కులాల అభ్యర్థుల కోసం ఎస్సీ యాక్షన్‌ ప్లాన్‌ ద్వారా బ్యాంకు లింకేజీతో, లింకేజీ లేని పథకాల మంజూరుకు దరఖాస్తు గడువు ఏప్రిల్‌ 2వ తేదీ వరకు పొడిగించినట్లు కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి తెలిపారు. వాహనాలతో పాటు వ్యవసాయ డ్రోన్లు, పాడి పశువులు తదితర యూనిట్లు మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. వ్యవసాయేతర పథకాలకు 21నుంచి 50ఏళ్లు, వ్యవసాయ ఆధారిత పథకాలకు 60ఏళ్ల వయస్సు వరకు అర్హులని తెలిపారు. ఆధార్‌, రేషన్‌ కార్డులు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, డ్రైవింగ్‌ లైసెన్స్‌తో tsobmms.cgg.gov.in వెబ్‌సైట్‌ ద్వారా ఏప్రిల్‌ 2వ తేదీలోగా దరఖాస్తు చేసుకుని, కాపీలకు పత్రాలు జతచేసి ఎంపీడీఓ, మున్సిపల్‌ కార్యాలయాల్లో అందించాలని సూచించారు.

స్పోర్ట్స్‌ స్కూల్‌ ప్రవేశానికి 30న జిల్లా స్థాయి పోటీలు

ఖమ్మం స్పోర్ట్స్‌: రాష్ట్రంలోని స్పోర్ట్స్‌ స్కూళ్లలో ప్రవేశాలు కల్పించేందుకు ఈనెల 30న జిల్లా స్థాయి పోటీలు నిర్వహిస్తున్నట్లు డీవైఎస్‌ఓ పి.సునీల్‌రెడ్డి తెలిపారు. ఖమ్మం సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో ఈ పోటీలు జరుగుతాయని వెల్లడించారు. పోటీలకు హాజరయ్యే విద్యార్థులు మూడో తరగతి పాస్‌ సర్టిఫికెట్‌తో పాటు వయసు ధ్రువీకరణ పత్రం, ఆధార్‌ కార్డు, ఐదు పాప్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలు ఉదయం 8గంటలకు రిపోర్ట్‌ చేయాలని సూచించారు. మండల స్థాయి ఎంపికలకు హాజరు కాని వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న ఫామ్‌తో నేరుగా హాజరుకావొచ్చని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement