చెల్లని చెక్కు కేసులో రెండేళ్ల జైలుశిక్ష
ఖమ్మంలీగల్: ఖాతాలో సరిపడా నగదు లేకున్నా చెక్కు జారీ చేసిన వ్యక్తికి రెండేళ్ల జైలుశిక్ష విధిస్తూ ఖమ్మం రెండో అదనపు ప్రథమ శ్రేణి కోర్టు న్యాయాధికారి ఏపూరి బిందుప్రియ మంగళవారం తీర్పు చెప్పారు. ఖమ్మం శ్రీరామ్ హిల్స్‌కు చెందిన బెల్లం మనోహర్‌రావు వద్ద ప్రశాంతినగర్‌కు చెందిన షేక్ ఖద్దూస్ అప్పు తీసుకున్నాడు. ఆపై 2024 నవంబర్‌లో రూ.25 లక్షలకు చెక్కు ఇచ్చినా ఆయన ఖాతాలో సరిపడా నగదు లేకపోవడంతో తిరస్కరణకు గురైంది. దీంతో మనోహర్‌రావు తన న్యాయవాది ద్వారా లీగల్ నోటీసు జారీ చేసి కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు చేశాడు. విచారణలో ఆయనపై నేరం రుజువు కావడంతో రెండేళ్ల జైలుశిక్ష విధించడమే కాక ఫిర్యాదికి రూ.25 లక్షలు చెల్లించాలని తీర్పు చెప్పారు. కాగా, మరో కేసులో ఖమ్మం పాకబండబజార్‌కు చెందిన మహమ్మద్ అంజాద్‌కు ఆరు నెలల జైలుశిక్ష విధిస్తూ ఆబ్కారీ కోర్టు న్యాయమూర్తి అఖిల తీర్పు చెప్పారు.
కారేపల్లిలో కల్తీ మద్యం కలకలం?
కారేపల్లి: కారేపల్లిలో నకిలీ మద్యం అమ్ముతున్నారనే సమాచారం కలకలం రేపింది. బెల్టు దుకాణాల్లో మద్యం సీసాల మూతలు తెరిచి, ఆపై కల్తీ చేసి విక్రయిస్తున్నారనే ప్రచారంతో సోమ, మంగళవారం ఎకై ్సజ్ సీఐ స్రవంతి, ఎస్‌ఐ వసంతలక్ష్మి ఆధ్వర్యాన సిబ్బంది తనిఖీలు చేపట్టారు. లావుడ్యాతండా, భాగ్యనగర్ తండాల్లోని బెల్ట్ షాపుల్లో మూతలు తెరిచి ఉన్న 114 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. కారేపల్లిలోని ఒకే వైన్స్ నుంచి బెల్టు షాపులకు మద్యం సరఫరా అయిందనే అనుమానంతో విచారణ చేపడుతున్నారు. ఈ విషయమై సీఐ స్రవంతిని వివరణ కోరగా.. బెల్టు షాపుల్లో మద్యం సీసాల మూతలు వదులుగా ఉండడంతో స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.
ఖమ్మంరూరల్: మండలంలోని పడమటితండాకు చెందిన మాలోతు జగ్గా (41) అప్పుల బాధ తాళ లేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయ న చికిత్సతో పాటు కుటుంబ అవసరాలకు రూ.4లక్షల అప్పులు చేశాడు. ఇవి తీర్చే మార్గం లేక ఈనెల 7న ఇంట్లో ఎవరూ లేని సమయాన గడ్డి మందు తాగాడు. కాసేపటికి గమనించిన కుటుంబీకులు ఖమ్మంలో చికిత్స చేయిస్తుండగా మంగళవారం మృతి చెందాడు. ఘటనపై జగ్గా కుమారుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ ముష్క రాజు తెలిపారు.
ఖమ్మంమయూరిసెంటర్: దేశంలో ఔషధరంగ అభివృద్ధికి ప్రత్యేక ఆర్థికమండలి (ఎస్‌ఈజెడ్‌లు/సెజ్‌లు) కీలకంగా మా రుతున్న నేపథ్యాన తెలంగాణ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ సహాయమంత్రి జితిన్‌ప్రసాద్ పేర్కొన్నారు. ఖమ్మం ఎంపీరామ సహాయం రఘు రాంరెడ్డి మంగళవారం లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానం ఇచ్చారు. దేశంలో ప్రస్తుతం 15ఫార్మా ఎస్‌ఈజెడ్‌లు నోటిఫై అయ్యాయని వెల్లడించారు. తెలంగాణలో ఫార్మారంగ అభివృద్ధికి ఇవికీలకంగా మారుతుండగా, 56 ఔషధ యూనిట్లు కొనసాగుతున్నాయని వివరించారు.


