మూడో ప్రపంచ యుద్ధం వచ్చే సూచనలు | - | Sakshi
Sakshi News home page

మూడో ప్రపంచ యుద్ధం వచ్చే సూచనలు

Mar 16 2026 7:30 AM | Updated on Mar 16 2026 7:30 AM

బోనకల్‌: మూడో ప్రపంచ యుద్ధం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. బోనకల్‌లో ఆదివారం బత్తినేని చారిటబుల్‌ ట్రస్టు సహకారంతో నిర్మించిన సీపీఐ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. డాలర్‌ పెత్తనంతోనే యుద్ధ జరుగుతోందని, వెనిజులాలో దేశాధ్యక్షుడి కుటుంబ సభ్యులకు బేడీలు వేసి కారాగారంలో పెట్టిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భవిష్యత్‌లో మోదీని కూడా జైలులో పెట్టొచ్చని జోస్యం చెప్పారు. గతంలో సోవియట్‌ రష్యా అమెరికా పెత్తనానికి అడ్డుకట్ట వేయగలిగిందని, కమ్యూనిస్టులు బలంగా లేకపోతే మనవవాళికి రక్షణ ఉండదని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర నాయకులు బాగం హేమంతరావు, జమ్ముల జితేందర్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి దండి సురేశ్‌, గోవిందరావు, షేక్‌ మహ్మద్‌ మౌలానా, బత్తినేని నీరజ, నాగ ప్రసాద్‌, రాకేశ్‌, ప్రకాష్‌, రోషన్‌కుమార్‌, యంగల ఆనందరావు, తోట రామాంజనేయులు, సర్పంచ్‌ బాణోతు జ్యోతి, ఉప సర్పంచ్‌ కొండ, కిలారు సురేశ్‌ పాల్గొన్నారు.

17 మిలియన్‌ టన్నుల లక్ష్యం

రుద్రంపూర్‌: సింగరేణి సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో 72 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి లక్ష్యసాధన కోసం కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో మార్చి 15వ తేదీ వరకు 67.76 మిలియన్‌ టన్నులు సాధించాల్సి ఉండగా, 55.00మిలియ న్‌ టన్నులు 81శాతం ఉత్పత్తి చేసింది. రానున్న మార్చి 31 నాటికి 72 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి పూర్తి చేయాల్సి ఉంది. అంటే ఈ 15 రోజుల్లో 17 మిలియన్‌ టన్నులు ఉత్పత్తి చేయాలి. గతేడాది ఈరోజు నాటికి 63.50 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సాధించగా.. ఈ ఏడాది 55.00 మిలియన్‌ టన్నులు ఉత్పత్తి కాగా.. సుమారు 8.50 మిలియన్‌ టన్నులు వెనుకబడింది.

రంజాన్‌ను ఘనంగా జరుపుకోవాలి

పాల్వంచ: ముస్లింలు పవిత్ర రంజాన్‌ పండుగను ఘనంగా జరుపుకోవాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఆదివారం నటరాజ్‌ సెంటర్‌లోని జమా మసీద్‌లో ఇఫ్తార్‌ విందు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ రంజాన్‌ ఐక్యతను చాటుతుందని, తోటి వారికి సహాయం చేయాలనే ఉద్దేశాన్ని తెలుపుతుందని అన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు వనమా రాఘవేందర్‌ రావు, మల్లెల రవిచంద్ర, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

పెద్దమ్మతల్లికి విశేషపూజలు

పాల్వంచరూరల్‌: పెద్దమ్మతల్లి అమ్మవారికి ఆదివారం అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయానికి రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. క్యూలైన్‌ ద్వారాఅమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులు అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పూజా కార్యక్రమంలో ఈఓ ఎన్‌.రజనీకుమారి,ఆలయ కమిటీ చైర్మన్‌ బాలినేని నాగేశ్వరరావు, వేదపండితులు పద్మనాభశర్మ, రవికుమార్‌శర్మ పాల్గొన్నారు.

నేడు ‘షబ్‌–ఏ–ఖదర్‌’

కరకగూడెం: పవిత్ర రంజాన్‌ మాసం కావడంతో ముస్లింలు భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేస్తున్నారు. గత నెల 19 నుంచి ఉపవాస దీక్షలు పాటిస్తున్నారు. నేడు (సోమవారం) రాత్రి మసీదుల్లో ప్రత్యేక జాగారం చేయనున్నారు. రంజాన్‌ మాసం చివరి పది రోజుల్లో వచ్చే ఐదు బేసి రాత్రుల్లో ఒకటైన ఈ రాత్రికి ఇస్లాంలో ఎంతో విశిష్టత ఉంది. ఈ రాత్రి చేసే ప్రార్థనలు వెయ్యి మాసాల ప్రార్థనల కంటే ఎక్కువ పుణ్య ఫలాన్ని ఇస్తాయని ముస్లింలు విశ్వసిస్తారు. జిల్లా వ్యాప్తంగా 110మసీదులు ఉండగా, సుమారు 80 వేలమంది ముస్లింలు ఉన్నారు. జాగారం చేసేందుకు మసీదులను ముస్తాబు చేశారు. రాత్రంతా మేల్కొని ఖురాన్‌ పఠించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement