311మందికి అక్కడే స్థలం, ఇందిరమ్మ ఇళ్లు
మరో 101 మందికి స్వస్థలాల్లో ఇళ్ల మంజూరు
నేడు పట్టాలు పంపిణీ చేయనున్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొంగులేటి, తుమ్మల
అర్హులెవరో తేల్చేందుకు..
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్లలోని భూదాన్ భూముల్లోనే అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు దక్కుతున్నాయి. పలు దఫాలుగా వడపోసి అర్హులను గుర్తించారు. ఈ ప్రాంతంలో పలువురు నిర్మించుకున్న ఇళ్లను కూల్చివేయగా ఆందోళనలు మిన్నంటిన విషయం విదితమే. ఈమేరకు అర్హుల గుర్తింపునకు ప్రభుత్వం క్షేత్ర స్థాయి సర్వే చేయించింది. దీంతో జిల్లాకు చెందిన 412మంది అర్హులు ఉన్నట్లు తేలింది. ఇందులో 311మందికి భూదాన్ భూముల్లోనే ఇంటి స్థలం ఇవ్వడమే కాక ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనున్నారు. మరో 101మందికి వారి స్వస్థలాల్లో ఇంటి స్థలం ఉండడంతో ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు నిర్ణయించారు. మిగిలిన వారిలోనూ ఇంకా అర్హులు ఉన్నారా అనే అంశంపై సర్వే చేస్తున్నట్లు సమాచారం. కాగా, అర్హులుగా తేలిన వారికి బుధవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పట్టాలు పంపిణీ చేయనున్నారు.
అనుమతి లేదని...
వెలుగుమట్లలోని భూదాన్ భూముల్లో నిర్మాణాలకు అనుమతి లేదని గత నెల 24న ఉదయం 720 ఇళ్లను కూల్చేశారు. ఆతర్వాత నిర్వాసితులకు అధికారులు టీటీడీసీ, అంబేద్కర్ భవన్‌లో పునరావాసం కల్పించారు. ఇదే సమయాన కొందరికి నకిలీ పత్రాలు చూపి భూములను విక్రయించినట్లు తేలడంతో పలువురిపై కేసు నమోదు చేశారు. ఇక్కడి 147, 148, 149 సర్వే నంబర్లలో 31.7 ఎకరాల భూదాన్ భూమి ఆక్రమణలో ఉండగా.. భూమి విలువ రూ.250 కోట్లు ఉంటుందని అధికారులు ప్రకటించారు.
ఆందోళనలు ఉధృతమై..
భూదాన్ భూముల్లో ఇళ్ల కూల్చివేత అనంతరం ఆందోళనలు ఉధృతమయ్యాయి. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బాధితులను పరామర్శించి వారి తరఫున పోరాడతామని హామీ ఇచ్చారు. అలాగే, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ.రాఘవులు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తదితరులు కూడా భూదాన్ బాధితులను పరామర్శించి వారికి న్యాయంచేయాలని డిమాండ్ చేశారు.
తొమ్మిది ఎకరాలు...
భూదాన్ భూములు వెలుగుమట్లలోని 147, 148, 149 సర్వే నంబర్లలో విస్తరించి ఉన్నాయి. ఈ భూమిలో ఇళ్ల శిథిలాలను రెండు రోజులుగా తొలగిస్తూ చదును చేయిస్తున్నారు. ఇక్కడి 148, 149 సర్వే నంబర్లలో తొమ్మిది ఎకరాలను నిర్వాసితులకు కేటాయించినట్లు సమాచారం. ఇందులో 311మందికి 75 గజాల చొప్పున భూమి పట్టాతో పాటు ఇందిరమ్మ ఇంటి మంజూరు పత్రాలను డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కలెక్టరేట్‌లో బుధవారం అందజేయనున్నారు.
గడువుకు ముందే...
కూల్చివేతల అనంతరం ఆందోళనలు మిన్నంటిన నేపథ్యాన బాధితులతో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలెక్టరేట్‌లో ఈనెల 1వ తేదీన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బాధితుల్లో అర్హులకు అండగా నిలుస్తామని, 15వ తేదీలోగా ఇంటి నిర్మాణాలకు ముగ్గు పోయిస్తామని ప్రకటించారు. ఈమేరకు మంత్రి ఆదేశాలతో అధికారులు సర్వే చేపట్టి అర్హులను తేల్చారు. దీంతో మంత్రి చెప్పిన గడువుకు మూడు రోజుల ముందే పట్టాలు, ఇంటి అనుమతి పత్రాల పంపిణీకి ఏర్పాట్లు పూర్తికాగా.. సర్వేలో అర్హులుగా తేలిన వారికి మంగళవారం కలెక్టరేట్‌లో రెవెన్యూ సిబ్బంది టోకెన్లు అందజేశారు. అంతేకాక రెండు రోజులుగా భూదాన్ భూముల్లో చేపడుతున్న శిథిలాల తొలగింపు, చదును చేసే పనులు చివరి దశకు చేరాయి.
సర్వే ద్వారా భూదాన్ బాధితుల్లో స్థానికుల గుర్తింపు
ఇళ్లు కోల్పోయిన వారిలో అర్హులెవరో తేల్చేందుకు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు సర్వే చేపట్టారు. బాధితుల వివరాలు సేకరించి వారి స్థలాల్లో ఆర్ధిక పరిస్థితి, ప్రభుత్వ పథకాల ద్వారా గతంలో లబ్ధి పొందారా అనే వివరాలు ఆరాతీశారు. ఈమేరకు ఇళ్లు నిర్మించుకున్న వారిలో ఖమ్మం జిల్లాతోపాటు భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, సూర్యాపేట, ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల వారు ఉన్నట్లు తేలింది. ఇందులో జిల్లాకు చెందిన వారు 415 మంది అర్హులని గుర్తించగా, వీరిలో ఖమ్మం నియోజకవర్గానికి చెందిన వారు 311 మంది ఉన్నారు. దీంతో వీరికి భూదాన్ భూమిలోనే ఇంటిస్థలం పట్టా ఇవ్వడంతోపాటు ఇందిరమ్మ ఇళ్లు కూడా మంజూరు చేయాలని నిర్ణయించారు. మిగతా 101 మంది జిల్లాలోని ఇతర మండలాలు వారు కావడం, అక్కడే ఇంటి స్థలం ఉన్నందున ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనున్నారు.


