రఘునాథపాలెం: గాలికుంటు వ్యాధిని అరికట్టేలా ప్రతీ ఆరు నెలలకోసారి పశువులకు టీకా వేయించాలని జిల్లా పశువైద్యాధికారి బి.పురంధర్ సూచించారు. ఈమేరకు ఆయన రఘునాథపాలెం మండలం వీవీపాలెంలో మంగళవారం వ్యాక్సినేషన్‌ను ప్రారంభించి మాట్లాడారు. గాలికుంటు వ్యాధి సోకితే పశువుల్లో మరణశాతం తక్కువే అయినా ఉత్పాదకశక్తి, పునరుత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుందన్నారు. ఈ టీకా ద్వారా పశువులను సంరక్షించుకునే అవకాశం ఉన్నందున వచ్చేనెల 9వ తేదీ వరకు కొనసాగే శిబిరాల్లో నాలుగు నెలలు నిండిన ప్రతీ పశువుకూ టీకాలు వేయించి ఆన్‌లైన్‌లో నమోదు చేయించుకోవాలని సూచించారు. ఖమ్మం మార్కెట్ చైర్మన్ యరగర్ల మన్మంతరావు, సర్పంచ్ కాపా ఆదినారాయణ, మండల పశు వైద్యాధికారి కె.క్రాంతికుమార్, సిబ్బంది టి.కృష్ణ, సత్యనారాయణ, సువర్చల, మణిదీప్ పాల్గొన్నారు. అలాగే, రఘునాథపాలెంలో వ్యాక్సినేషన్‌ను సర్పంచ్ గాజుల కృష్ణారావు ప్రారంభించగా, మండల పశువైద్యాధికారి గంగాధర్‌తో పాటు బానోతు ప్రశాంత్, నల్లమోతు శ్రీనివాస్‌రావు, రాంబాబు పాల్గొన్నారు.
సోలార్ విద్యుత్‌తో
పర్యావరణ రక్షణ
తిరుమలాయపాలెం: సోలార్ ప్లాంట్‌తో పర్యావరణానికి హానీ జరగకుండా అవసరాలకు సరిపడా విద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతుందని విద్యుత్‌శాఖ ఎస్‌ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి తెలిపారు. పీఎం కుసుమ్, ప్రధానమంత్రి కిసాన్ ఉర్జా, సురక్ష మహా అభయాన్ పథకం ద్వారా ఏర్పాటు చేస్తున్న ప్లాంట్లతో రైతుల అవసరాలు తీరడంతో పాటు స్థిరమైన ఆదాయం లభిస్తుందని వెల్లడించారు. మండలంలోని జూపెడలో రైతు బీరవల్లి శ్రీనివాసరావు పొలం వద్ద ఏర్పాటు చేసిన రెండు మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్లాంట్‌ను మంగళవారం ఎస్‌ఈ ప్రారంభించి విద్యుత్‌ను గ్రిడ్(సబ్‌స్టేషన్)కు అనుసంధానం చేశారు. అనంతరం ఎస్‌ఈ మాట్లాడుతూ జిల్లాలో ఈ పథకం ద్వారా ఏర్పాటు చేసి గ్రిడ్‌కు అనుసంధానమైన తొలి ప్లాంట్ ఇదేనని తెలిపారు. జిల్లాలో మరో 43 మంది రైతుల ప్లాంట్లు నిర్మాణంలో ఉన్నాయని చెప్పారు. రెడ్‌కో జిల్లా మేనేజర్ పోలిశెట్టి అజయ్‌కుమార్, డీఈ నాగేశ్వరరావు, సర్పంచ్‌లు వనవాసం నరేందర్‌రెడ్డి, గండు చంద్రయ్య, గూడురు ఉపేందర్, ఆత్మ కమిటీ డైరెక్టర్ ఓర వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
కొనసాగుతున్న
ఇంటర్ పరీక్షలు
ఖమ్మం సహకారనగర్: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్నాయని డీఐఈఓ రవిబాబు తెలిపారు. ఈమేరకు మంగళవారం జరిగిన ద్వితీయ సంవత్సరం పరీక్షకు 16,862మంది విద్యార్థుల్లో 16,521మంది హాజరుకాగా, 341మంది ద్యార్థులు గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. పలు కేంద్రాలను రాష్ట్ర అబ్జర్వర్ జి.రవి, పి.గురువారెడ్డి పరిశీలించగా, తనతో పాటు డీఈసీ, హెచ్‌పీసీ, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు కూడా తనిఖీ చేసినట్లు తెలిపారు.


