వైరా: రైతులు వ్యవసాయంలో సాంకేతికతను జోడిస్తూ ఆధునిక పద్ధతులు పాటిస్తే మంచి ఫలితాలు వస్తాయని జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య తెలిపారు. వైరా మున్సిపాలిటీ పరిధి సోమవరం రైతు వేదికలో మంగళవారం ఆత్మ కమిటీ ఆధ్వర్యాన చర్చాగోష్టి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఏఓ మాట్లాడుతూ యాప్ ద్వారా యూరియా కొనుగోలు సులభతరమైందన్నారు. సంప్రదాయ పంటల స్థానంలో ఆయిల్‌పామ్ సాగు చేస్తే దీర్ఘకాలిక ఆదాయం వస్తుందని తెలిపారు. అనంతరం నానో యూరియా, డ్రోన్‌తో మందుల పిచికారీతో లాభాలను వివరించగా, రైతుల సందేహాలను కేవీకే శాస్త్రవేత్తలు నివృత్తి చేశారు. కేవీకే శాస్త్రవేత్త పావని, ఏఓ మయాన్ మంజుఖాన్, హార్టికల్చర్ ఆఫీసర్ ఆకుల వేణు, ఏఈఓలు వెంపటి కీర్తి, పరిటాల వాసంతి, వెంకయ్య, మేడా సంపత్, సైదులు, రాకేష్, కౌన్సిలర్ దొంతెబోయిన వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.


