కొలువుదీరేది నేడే..
పదవులకు తీవ్ర పోటీ..
కౌన్సిలర్ల ప్రమాణం తర్వాత
చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక
జిల్లాలో ఐదు మున్సిపల్ పీఠాలు
కాంగ్రెస్‌కే..
చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు
తీవ్ర పోటీ
నేడు పేర్లు ప్రకటించనున్న
ఇన్‌చార్జి మంత్రి కొండా సురేఖ
ఖమ్మంమయూరిసెంటర్: జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నగారా ముగిసి, ఫలితాలు వెలువడడంతో ఇప్పుడు అందరి దృష్టీ చైర్మన్ పీఠాలపై పడింది. చైర్మన్, వైస్ చైర్మన్ల పదవులు ఎవరికి దక్కుతాయోనని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. సోమవారం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియకు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి నేతృత్వంలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏదులాపురం మున్సిపల్ కౌన్సిలర్ల ప్రమాణస్వీకారం, చైర్మన్ ఎన్నిక ప్రక్రియను ఖమ్మం రూరల్ ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేయగా.. మిగిలిన చోట్ల ఆయా మున్సిపల్ కార్యాలయాల్లో నిర్వహించనున్నారు.
ప్రిసైడింగ్ అధికారుల నియామకం..
మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల నిర్వహణకు ఐదుగురు గెజిటెడ్ హోదా గల వారిని ప్రిసైడింగ్ అధికారులుగా నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏదులాపురానికి అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, మధిరకు ఎస్సీ కార్పొరేషన్ అధికారి నవీన్‌బా బు, వైరాకు ఖమ్మం ఆర్డీఓ నర్సింహారావు, సత్తుపల్లికి కలూర్లు సబ్ కలెక్టర్ అజయ్‌యాదవ్, కల్లూరుకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజేశ్వరిని నియమించారు.
ఉదయం ప్రమాణ స్వీకారం..
మధ్యాహ్నం ఎన్నిక
కొత్తగా ఎన్నికై న మున్సిపల్ కౌన్సిలర్లతో సోమవారం ఉదయం 11 గంటలకు ప్రత్యేకాధికారులు ప్రమాణ స్వీకారం చేయిస్తారు. మధ్యాహ్నం 12.30 గంటలకు కౌన్సిల్ ఏర్పాటు చేసి కోరం పూర్తయితే చైర్మన్, వైస్ చైర్మన్‌ల ఎన్నికను పరోక్ష పద్ధతిన నిర్వహిస్తారు. కోరం పూర్తి కాకుంటే మరుసటి రోజుకు వాయిదా వేస్తారు. అయితే ఏదులాపురం, మధిర, వైరా, సత్తుపల్లి, కల్లూరు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌కు మెజార్టీ స్థానాలు దక్కడంతో ఆ పార్టీకే చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు దక్కనున్నాయి. ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు ఇన్‌చార్జి మంత్రి ద్వారా మున్సిపల్ అధికారులకు విప్ కూడా జారీ చేయగా, గెలుపొందిన వారితో పాటు ఎక్స్ అఫీషియో సభ్యులు చైర్మన్ ఎన్నిక ప్రక్రియకు హాజరు కానున్నారు.
అక్షర క్రమంలో పిలుపు..
మున్సిపల్ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారంలో అధికారులు క్రమ పద్ధతిని పాటించనున్నారు. సభ్యుల నామినేషన్ పత్రాల్లో ని పేర్ల ఆధారంగా తెలుగు అక్షర క్రమంలో ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తారు. ఎవరైనా ఇంగ్లిష్‌లో పత్రాన్ని నింపితే.. ముందుగా తెలుగులో పేర్లున్న వారితో ప్రమాణ స్వీకారం చేయించి, ఆ తర్వాత మిగిలిన వారిని పిలుస్తారు. చైర్మన్, వైస్ చైర్మన్‌లను కౌన్సిలర్లు చేతులెత్తే విధానం ద్వారా ఎన్నుకుంటారు. ఒక్కరే అభ్యర్థి ఉన్నచోట ఏకగ్రీవంగా ప్రకటిస్తారు. ఆ అభ్యర్థిని ఒక కౌన్సిలర్ ప్రతిపాదించగా.. మరో కౌన్సిలర్ ఆమోదించాల్సి ఉంటుంది.
అధిష్టానం నిర్ణయమే ఫైనల్..
మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్‌ల ఎంపిక బాధ్యతను అధిష్టానం తీసుకుంది. స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రుల సూచనతో పాటు పార్టీ అనుసరిస్తున్న విధానాలను ప్రామాణికంగా తీసుకొని చైర్మన్ అభ్యర్థులను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక న్యాయం, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలయ్యేలా పేర్లు ఖరారు చేసినట్లు సమాచారం. ఐదు మున్సిపాలిటీల చైర్మన్‌ల పేర్లను, వారికి సంబంధించిన బీ –ఫామ్‌లను సీల్డ్ కవర్లలో పెట్టి ఇన్‌చార్జి మంత్రి కొండా సురేఖకు అందజేశారని, ఆదివారం రాత్రికే జిల్లాకు చేరుకున్న మంత్రి.. సోమవారం ఉదయం ఆయా ఎమ్మెల్యేలకు సీల్డ్ కవర్లను అందజేసి, అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటించనున్నారని తెలిసింది.
క్యాంపు నుంచి కౌన్సిల్‌కు..
మున్సిపల్ ఎన్నికల అనంతరం సత్తుపల్లి, కల్లూరు, వైరా మున్సిపాలిటీల పరిధిలోని కాంగ్రెస్ వార్డు సభ్యులను ఈనెల 13న రాత్రే హైదరాబాద్ క్యాంపునకు తరలించారు. వారు తిరిగి సోమవారం ప్రత్యేక బస్సుల ద్వారా ఆయా మున్సిపాలిటీలకు చేరుకోనున్నారు. కౌన్సిలర్ల ప్రమాణస్వీకారం, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక తర్వాతనే ఇంటికి వెళ్లనున్నారు.
ఎక్స్ అఫీషియో సభ్యులుగా నమోదు
మున్సిపల్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఆయా ఎమ్మెల్యేలు పేర్లు నమోదు చేసుకున్నారు. మధిరలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సత్తుపల్లిలో ఎమ్మెల్యే మట్టా రాగమయి, వైరాలో మాలోత్ రాందాస్ నాయక్ పేర్లు నమోదు చేసుకోగా వారు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో పాల్గొంటారు.
విప్‌ల నియామకం
మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్‌ల ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ విప్‌లను నియమిస్తూ టీపీసీసీ ఉత్తర్వులు జారీ చేసిందని డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ తెలిపారు. ఏదులాపురానికి తుంబూరు దయాకర్ రెడ్డి, మధిరకు కోనా ధనికుమార్, వైరాకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్, కల్లూరుకు పొంగులేటి ప్రసాదరెడ్డి, సత్తుపల్లికి ఎమ్మెల్యే మట్టా రాగమయిని నియమించినట్లు పేర్కొన్నారు.
జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ మెజార్టీ వార్డులను గెలుచుకోవడంతో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు ఆశించేవారి నుంచి తీవ్ర పోటీ నెలకొంది.
ఏదులాపురం మున్సిపల్ చైర్మన్ పదవికి 23వ వార్డు నుంచి గెలిచిన పోకబత్తిని అనిత, 9వ వార్డు నుంచి గెలిచిన కందుకూరి శేషమ్మ పోటీ పడుతున్నారు.
మధిరలో చైర్మన్ పదవిని 6వ వార్డు నుంచి గెలిచిన వేమిరెడ్డి లక్ష్మీతులసి, 8వ వార్డు నుంచి గెలిచిన యన్నం కోటేశ్వరరావు, 12వ వార్డు నుంచి గెలిచిన మోదుగు నాగలక్ష్మి ఆశిస్తున్నారు.
వైరాలో 3వ వార్డు నుంచి గెలిచిన బొర్రా ఉమాదేవి, 6వ వార్డు నుంచి గెలుపొందిన కాపా చంద్రకళ చైర్మన్ పదవి ఆశిస్తున్నారు.
సత్తుపల్లిలో చైర్మన్ పదవి కోసం ఎండీ రెహనా బేగం, తోట సుజల రాణి, బొంతు సమలత పోటీ పడుతున్నారు.
కల్లూరులో ధరావత్ మోహన్ నాయక్, బాణోత్ మారోని చైర్మన్ పదవిని ఆశిస్తున్నారు. వైస్ చైర్మన్ పదవికి కూడా పోటీ తీవ్రంగా నెలకొంది.
మున్సిపల్ పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తి
కొలువుదీరేది నేడే..
కొలువుదీరేది నేడే..


