విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు
● అన్ని హంగులతో ప్రభుత్వ బడులను తీర్చిదిద్దుతున్నాం ● డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
మధిర: భవిష్యత్‌లో ప్రభుత్వ పాఠశాలలో చదవడం తమ అదృష్టంగా విద్యార్థులు భావించేలా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. మధిరలోని తేళ్ల వసంతయ్య మెమోరియల్ (టీవీఎం) ప్రభుత్వ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థి సంఘం 48వ వార్షిక సమ్మేళనం ఆదివారం నిర్వహించగా, భట్టి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 48వ వార్షిక సంచికను ఆవిష్కరించిన ఆయన, విద్యారంగంపై ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చర్యలను వివరించారు. అత్యాధునిక వసతులతో పాఠశాలలను పునర్నిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలంటే కేవలం భవనాలు మాత్రమే కాదని, అవి విజ్ఞాన కేంద్రాలని అన్నారు. బడ్జెట్‌లో విద్యకు పెద్దపీట వేస్తూ, ప్రభుత్వ పాఠశాలల మరమ్మతులు, డిజిటల్ విద్యా విధానం, తరగతి గదుల నిర్మాణం, తాగునీటి వసతి, బాలికలకు ప్రత్యేక వసతులు, లైబ్రరీ వంటి మౌలిక సదుపాయాల కల్పన కోసం భారీగా నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. తెలంగాణ బిడ్డలు ప్రపంచ దేశాలతో పోటీపడేలా అంతర్జాతీయ ప్రమాణాలతో 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణాలను అత్యంత వేగంగా పూర్తి చేస్తున్నామని వివరించారు. నాణ్యమైన విద్య ద్వారానే సమాజంలో మార్పు వస్తుందని, అందుకే ప్రజాప్రభుత్వం విద్యపై ప్రత్యేక దృష్టి సారించిందని ఆయన స్పష్టం చేశారు.
సమాజానికి తిరిగి ఇవ్వండి
పూర్వ విద్యార్థులు ఈ స్థాయికి చేరుకోవడానికి కారణమైన పాఠశాల, సమాజానికి తిరిగి ఏమి ఇవ్వగలరో ఆలోచించాలని డిప్యూటీ సీఎం సూచించారు. నేటి తరానికి స్ఫూర్తినిచ్చేలా పూర్వ విద్యార్థులు తమ అనుభవాలను పుస్తక రూపంలో తీసుకురావాలని సూచించారు. పెద్దల ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని అన్నారు. విద్యార్థులను భావి భారత మార్గదర్శకులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత గురువులపైనే ఉందని తెలిపారు. ఉపాధ్యాయులు కేవలం అక్షరాలను మాత్రమే కాకుండా, విద్యార్థుల్లో భాషా సంస్కారాన్ని, విలువల పట్ల గౌరవాన్ని పెంపొందించాలని, నాయకుల తప్పుడు ధోరణులను గుడ్డిగా అనుసరించకుండా, విజ్ఞతతో వ్యవహరించేలా వారిని మేధావులుగా మార్చాలని కోరారు. పాఠశాల దశలో నైతిక పునాదులు బలంగా పడితేనే, భవిష్యత్‌లో ఈ విద్యార్థులు సమాజానికి వెలుగునిచ్చే బాధ్యతాయుతమైన నాయకులుగా ఎదగగలరని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. అనంతరం పూర్వ విద్యార్థి సంఘం సావనీర్‌ను ఆవిష్కరించారు.


