నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు
ఖమ్మంవ్యవసాయం: మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం రాత్రి పలుచోట్ల ఆలయాల్లో స్వామివారి కల్యాణం నిర్వహించారు. భక్తులు వేలాదిగా పాల్గొనగా విద్యుత్ సరఫరాకు అంతరాయం రాకుండా ఎస్‌ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి ఆధ్వర్యంలో ఆ శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అవసరమైన చోట ప్రత్యేక ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశారు. సరఫరాలో ఆటంకం రాకుండా లైన్ల వెంట ఉన్న చెట్ల కొమ్మలను తొలగించారు. విద్యుత్ ఇంజనీర్లు, ఉద్యోగులు తీర్థాల, కూసుమంచి, స్నానాల లక్ష్మీపురం, పెనుబల్లి మండలం నీలాద్రి తదితర ఆలయాల వద్ద విధులు నిర్వర్తించారు.
జిల్లా వాలీబాల్ జట్ల ఎంపిక
ఖమ్మం స్పోర్ట్స్: ఉమ్మడి జిల్లాస్థాయి యూత్ వాలీబాల్ జట్ల వివరాలను వాలీబాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి బి.గోవిందారెడ్డి ఆదివారం వెల్లడించారు. ఇక్కడ ఎంపిక చేసిన బాలబాలికల జట్లు సోమవారం నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగే రాష్ట్రస్థాయి యూత్ పోటీల్లో పాల్గొంటాయని తెలిపారు. బాలుర జట్టుకు పి.సాయికృష్ణ, ఈ.ప్రణయ్, కె.చరణ్‌రాజ్, కృష్ణవంశీ, ప్రశాంత్, రుణ్‌తేజ్, వి.రాజేష్, బి.అజయ్, ఆశోక్, గోపినాథ్, రాజు, శివసాయిగణేష్, జానీ ఎంపికయ్యారని పేర్కొన్నారు. అలాగే, బాలికల జట్టులో ఆసియాబేగం, షేఖ్ పోని, షేక్ జాస్మిన్. సీహెచ్.వర్చన, సీహెచ్.వైష్ణవి, సీహెచ్.జ్యోత్స్న అవిజ్ఞ, బి.రిషికా, వి.ప్రణతి, బి.ప్రద్విక, ఎస్.రుత్విక, బి.అరవింద, పి.ఉమా, జి.ఉషా, ఎం.గ్రేసీకి స్థానం దక్కిందని వివరించారు.
వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన
ఖమ్మంవ్యవసాయం: ప్రకృతి, వన్యప్రాణుల సంరక్షణపై అటవీ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో పెద్దసంఖ్యలో భక్తులు హాజరయ్యే పండుగలు, జాతరల వద్ద అవగాహన కల్పించేలా జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ ఆధ్వర్యాన కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం కంట్రోల్ రూం ఏర్పాటు చేయడమే కాక సమస్యల పరిష్కారానికి 87422 95323 నంబర్‌ను అందుబాటులో ఉంచారు. మహా శివరాత్రి సందర్భంగా జిల్లాలోని అటవీ ప్రాంతాల సమీపాన ఉన్న ఆలయాల వద్ద భక్తులకు అవగాహన కల్పించారు. ఎకో టూరిజంగా పేరుగాంచిన పులిగుండాల అటవీ ప్రాంతం సమీపంలోని వీరభద్రస్వామి ఆలయంతో పాటు మరికొన్ని చోట్ల ఆదివారం ఈ కార్యక్రమం చేపట్టారు.
ప్లాస్టిక్ రహిత క్షేత్రాలుగా..
అటవీప్రాంతంలో ఉన్న ఆలయాల వద్ద ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు, వాటర్ బాటిళ్లు, కవర్ల వాడకా న్ని నిషేధించారు. ప్లాస్టిక్ వ్యర్థాలను అడవుల్లో వేస్తే వన్యప్రాణులు తిని ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని భక్తులకు అవగాహన కల్పించారు. కాగా, భక్తుల కోసం ప్రథమ చికిత్సా కేంద్రాలు సైతం ఏర్పాటు చేశారు.
నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు


