మీకో సగం.. మాకో సగం
● కొత్తగూడెం కార్పొరేషన్‌లో కాంగ్రెస్ – సీపీఐ మధ్య ఒప్పందం ● చెరో రెండున్నరేళ్లు మేయర్ పదవి ● తొలుత సీపీఐకి అవకాశం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ పదవిని చెరో రెండున్నరేళ్లు పంచుకునేలా కాంగ్రెస్, సీపీఐలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. మొదటి రెండున్నరేళ్లు మేయర్ పదవి సీపీఐకి, డిప్యూటీ మేయర్ పదవి కాంగ్రెస్ తీసుకోవాలని, ఆ తర్వాత రెండున్నరేళ్లు కాంగ్రెస్ మేయర్ పదవి, సీపీఐ డిప్యూటీ మేయర్ పదవి తీసుకోవాలని నిర్ణయించుకున్నాయి. దీంతో రెండు రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ఈ నెల 9న ఎన్నికలు జరగ్గా, 11న ఫలితాలు వెల్లడయ్యాయి. కార్పొరేషన్‌లో మొత్తం 60 డివిజన్లు ఉండగా, కాంగ్రెస్ మిత్రపక్షాలకు 22, సీపీఐ మిత్రపక్షాలకు 22 సీట్లు వచ్చాయి. మ్యాజిక్ ఫిగర్‌కు అవసరమైన 31 సీట్లు ఏ ఒక్క పార్టీకీ రాలేదు. మరోవైపు సీపీఐకి బేషరతుగా మద్దతు ఇచ్చేందుకు బీఆర్‌ఎస్ ముందుకొచ్చింది. ఫలితంగా సీపీఐ 22, బీఆర్‌ఎస్ ఎనిమిది మంది కార్పొరేటర్ల బలం కలుపుకుంటే మేజిక్ ఫిగర్ చేరేందుకు ఆస్కారం ఏర్పడింది. ఇదే సమయంలో స్వతంత్రులతో పాటు కొందరు తిరుగుబాటు కార్పొరేటర్లతో కాంగ్రెస్ సైతం మేయర్ పదవి కోసం ఆరంభంలో ప్రయత్నాలు చేసినా, ఆ తర్వాత అర్ధంతరంగా ఆ ప్రక్రియకు బ్రేక్ వేసింది. ఇంతలోనే కాంగ్రెస్, సీపీఐలకు చెందిన అగ్రనాయకులు ఈ అంశంలో జోక్యం చేసుకున్నారు. చివరకు పవర్ షేరింగ్‌పై ఇరువర్గాల మధ్య శనివారం ఒప్పందం కుదిరింది. అయితే, పవర్ షేరింగ్‌పై ఇటు కాంగ్రెస్, అటు సీపీఐలో కొత్తగూడేనికి సంబంధించిన నేతలు అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. దీంతో ఈ విషయం ఇక్కడితో సమసి పోతుందా లేక సోమవారం వరకు కొనసాగుతుందా అనేది చూడాలి.
సీపీఐలో మేయర్ పదవి ఎవరిని వరించునో...
సీపీఐ నుంచి 22 మంది కార్పొరేటర్లు గెలిచారు. ఇందులో మేయర్ పదవి రిజర్వ్ చేయబడిన ఎస్టీ సామాజిక వర్గం నుంచి ముగ్గురు కార్పొరేటర్లు గెలిచారు. వీరిలో ఒకరు మేయర్ అయ్యేందుకు ఆస్కారం ఉంది. సీపీఐ తరఫున గెలిచిన ముగ్గురు కార్పొరేటర్లు సైతం కొత్తగూడెం, పాల్వంచ, సుజాతనగర్ డివిజన్ల నుంచి గెలుపొందారు. వేర్వేరు ప్రాంతాలుగా ఉన్న ఈ మూడింటిని ఒక్కటిగా చేస్తూ కార్పొరేషన్‌గా మార్చారు. ఇప్పుడు మూడు ప్రాంతాల నుంచి ముగ్గురు అభ్యర్థులు గెలవడం, వారంతా మేయర్ పదవికి అర్హులై ఉండటం విశేషం. సుజాతనగర్ పరిధిలోకి వచ్చే 20వ డివి జన్ నుంచి మూడు గణేశ్ 277 ఓట్ల మెజారిటీతో గెలిచారు. పాల్వంచ పరిధిలోకి వచ్చే 31వ డివిజన్ నుంచి నూనావత్ శ్యామల 73 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. కొత్తగూడెం పరిధిలో 52వ డివిజన్ నుంచి బానోతు కళావతి 224 ఓట్ల మెజారిటీతో గెలుపు సాధించింది. ఎస్టీ సామాజిక వర్గం నుంచి ముగ్గురు ఇండిపెండెంట్లు గెలిచారు.
ఆది నుంచీ ఆసక్తి
కొత్తగూడెం మేయర్ కుర్చీలో తొలిసారిగా కూర్చునేది ఎవరనే అంశంపై ఆది నుంచీ ఆసక్తి నెలకొంది. కార్పొరేషన్ ఎస్టీ జనరల్ కేటగిరీకి రిజర్వ్ అయ్యింది. మొత్తం 60 డివిజన్లలో 11 డివిజన్లు ఎస్టీలకు రిజర్వ్ అయ్యాయి. దీంతో మేయర్ స్థానాన్ని లక్ష్యంగా చేసుకుని చాలా మంది అశావహులు ఎన్నికల బరిలో దిగారు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండే వైద్యులు సైతం ఖద్దరు బట్టలు తొడిగి రాజకీయ కదనరంగంలోకి దూకారు. వైద్యుడు భూక్యా శ్రీనివాసరావు జనరల్‌కు రిజర్వ్ అయిన ఆరో డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీలో నిలిచారు. ఆయన రికార్డు స్థాయిలో 608 ఓట్ల మెజార్టీ సాధించారు. కొత్తగూడెంలో ఇది రెండో అత్యధిక మెజారిటీ. సీనియర్ రాజకీయనేత శంకర్‌నాయక్ సతీమణి స్వప్నా నాయక్ 19వ వార్డు నుంచి పోటీ చేసి గెలిచారు. వీరు కాకుండా మూడో డివిజన్ నుంచి గుగులోతు శ్రీను, 23 డివిజన్ నుంచి బానోతు అనిత, 33 డివిజన్ నుంచి బానోతు బాలు ఉన్నారు.


