శ్రీవారికి అభిషేకం, నిత్య కల్యాణం
ఎర్రుపాలెం: మండలంలోని జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున స్వామి మూలవిరాట్‌తో పాటు ఆలయ ఆవరణలోని స్వామివారి పాదానికి పంచామృతంతో అభిషేకాలు చేశారు. అలాగే, స్వామి, అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్లను పట్టువస్త్రాలతో అలంకరించి నిత్య కల్యాణం జరిపించగా, ఆతర్వాత శ్రీవారికి పల్లకీ సేవలో వివిధ ప్రాంతాల భక్తులు పాలుపంచుకున్నారు. ఆలయ ఈఓ జగన్మోహన్‌రావు, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, సీనియర్ అసిస్టెంట్ సోమయ్య, జూనియర్ అసిస్టెంట్ కృష్ణప్రసాద్, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
నేడు మంత్రి పొంగులేటి పర్యటన
ఖమ్మంరూరల్: రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖమంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం జిల్లాలో పర్యటించనున్నారు. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఖమ్మం రూరల్ మండలం తీర్థాలలోని సంగమేశ్వరస్వామిని ఉదయం 8గంటలకు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. ఆతర్వాత కూసుమంచిలోని గణపేశ్వరస్వామి ఆలయానికి చేరుకుని స్వామిని మంత్రి దర్శించుకుంటారు.
మున్సిపల్ కౌన్సిల్‌హాల్ ముస్తాబు
సత్తుపల్లిటౌన్: సత్తుపల్లి మున్సిపాలిటీ నూతన పాలకవర్గం సోమవారం కొలువుదీరనుంది. ఇదే రోజు చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఉండడంతో కౌన్సిల్ హాల్‌ను ముస్తాబు చేస్తున్నారు. ఈమేరకు ఆవరణలో శుభ్రం చేయించడమే కాక మైక్‌సెట్లను శనివారం సరిచేశారు. ఈ పనులను కమిషనర్ కొండ్ర నర్సింహ పర్యవేక్షించగా ఏఈ సురేష్, మేనేజర్ మైసా శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి శిక్షణకు
నలుగురు మహిళా సర్పంచ్‌లు
కొణిజర్ల: హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్ భవనంలో ఈనెల 16నుండి 20వ తేదీ వరకు సర్పంచ్‌లకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణకు జిల్లా నుంచి నలుగురు మహిళా సర్పంచ్‌లు ఎంపికయ్యారు. కొణిజర్ల మండలం మోకాలకుంట సర్పంచ్ భూక్యా అనితతో పాటు వైరా మండలం విప్పలమడక సర్పంచ్ మేడ హేమిమా చక్రపాణి, రఘునాథపాలెం మండలం జీ.కే.బంజర, చింతగుర్తి సర్పంచ్‌లు ఎం.జ్యోతి, టి.ప్రియాంక ఇందులో ఉన్నారు. ‘స్థానిక పాలనలో మహిళా సాధికారత’ అంశంపై ఈ శిక్షణ శిబిరం జరగనుంది.
శ్రీవారికి అభిషేకం, నిత్య కల్యాణం
శ్రీవారికి అభిషేకం, నిత్య కల్యాణం


