పట్టు‘భట్టి’ విజయం
● మధిర మున్సిపల్‌పై తొలిసారి కాంగ్రెస్ జెండా ● డిప్యూటీ సీఎం వ్యూహంతో 22కు 21వార్డుల్లో విజయం ● ఒకే వార్డుకు పరిమితమైన బీఆర్‌ఎస్, సీపీఎం, సీపీఐ కూటమి
మధిర: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేసినప్రచారం, మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు మంజూరు చేయిస్తున్న నిధుల వివరాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతో ఎన్నికల్లో ఏకపక్షంగా జనం కాంగ్రెస్ అభ్యర్థులకు పట్టం కట్టారు. మధిర మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందేనని పట్టు‘భట్టి’న ఆయన పార్టీ శ్రేణులను కదిలిస్తూనే స్వయంగా ప్రచారం చేశారు. దీంతో ఇక్కడ 22వార్డులకు గాను కాంగ్రెస్ స్వయంగా 18వార్డులు గెలుచుకోగా, కూటమితో కలిపి 21సీట్లు సొంతమయ్యాయి. ఇదే సమయాన బీఆర్‌ఎస్, సీపీఎం, సీపీఐ కలిసి పోటీ చేసి ఒకే సీటుకు పరిమితమైంది.
చేస్తున్నవి ఇవీ..
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చేసిన అభివృద్ధి, మరికొన్ని పనులకు మంజూరు చేయించిన నిధుల వివరాలను భట్టి ప్రచారంలో వివరించారు. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్ ఏర్పాటు, వరద ముంపు నివారణకు వైరా నదికి కరకట్ట నిర్మాణం, ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులను ప్రస్తావించారు. గత పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో లేదని, మున్సిపాలిటీ అప్పటి అధికార పార్టీ చేతిలోనే ఉన్నా నిధులు మంజూరు చేయలేదని ప్రచారంలో వివరించారు. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉండడమే కాక డిప్యూటీ సీఎంగా ఆర్థిక, విద్యుత్, ప్రణాళికా శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నానని తెలిపారు.
బాధ్యతల అప్పగింత
ఎన్నికల ప్రచారంలో ఎక్కడ కూడా భట్టి విమర్శల జోలికి వెళ్లకుండా చేసిన, చేయబోయే అభివృద్ధిని మాత్రమే ప్రస్తావించారు. మధిర ఓ పక్క డిప్యూటీ సీఎం స్వయంగా ప్రచారం చేస్తూనే సీనియర్లకు సైతం బాధ్యతలు అప్పగించారు. అలాగే, ప్రచా రం, ఇతర వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. దీంతో 22 వార్డులకు గాను 21వార్డుల్లో కాంగ్రెస్ కూటమిని గెలిపించి తొలిసారి మధిర మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగురవేయించారు.


