ఆర్‌ఎంఓలు మరింత మంది!
● జిల్లా జనరల్ ఆస్పత్రిలో పర్యవేక్షణకు ఐదుగురు ● 24గంటలు వైద్యసేవలు అందించేలా చర్యలు
ఖమ్మంవైద్యవిభాగం: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి మెడికల్ ఎడ్యూకేషన్ పరిధిలోకి వెళ్లాక విభాగాలు విస్తరించాయి. మెడికల్ కళాశాలకు అనుసంధానంగా ఆస్పత్రికి ఎక్కువ సంఖ్యలో వైద్యులు, పారామెడికల్ సిబ్బందిని కేటాయించారు. అయినప్పటికీ వైద్యసేవలు మాత్రం పూర్తి స్థాయిలో మెరుగుపడలేదు. సిబ్బందిని పర్యవేక్షించాల్సిన అధికారులు అవసరం మేర లేకపోవడమే ఇందుకు కారణమని ఇటీవల నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ గుర్తించారు. ఈమేరకు రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్(ఆర్‌ఎంఓ) పోస్టులు భర్తీ చేయాలని మెడికల్ సూపరింటెండెంట్ ఎం.నరేందర్‌ను ఆదేశించారు. దీంతో పాలనా సౌలభ్యం కోసం పలు విభాగాల పర్యవేక్షణకు ఆర్‌ఎంఓలను నియమించారు.
సివిల్ అసిస్టెంట్ సర్జన్‌లకు బాధ్యతలు
ప్రస్తుతం సివిల్ సర్జన్ ఆర్‌ఎంఓ పోస్టు ఖాళీగా ఉండడడంతో రెగ్యులర్ డిప్యూటీ సివిల్ సర్జన్ బి.రాంబా బు ఆర్‌ఎంఓగా ఆస్పత్రి మొత్తాన్ని పర్యవేక్షిస్తున్నా రు. అటు మెడికల్ సూపరింటెండెంట్, ఇటు ఆర్‌ఎంఓతో అన్ని విభాగాలు పర్యవేక్షించడం కష్టమవుతోంది. ఈ నేపథ్యాన కొందరు సమయపాలన పాటించకపోగా సేవలకు విఘాతం ఏర్పడుతోంది. దీంతో కలెక్టర్ ఆదేశాల మేరకు జనరల్ ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్న నలుగురు సివిల్ అసిస్టెంట్ సర్జన్ వైద్యులకు తాత్కాలికంగా ఆర్‌ఎంఓలుగా బాధ్యతలు అప్పగించారు. వీరిలో డాక్టర్ కె.శ్రీలతకు మాతా శిశు ఆరోగ్య కేంద్రం గ్రౌండ్ ఫ్లోర్, ఎం.అనితకు ఎంసీహెచ్ మొదటి, రెండో ఫ్లోర్ బాధ్యతలు అప్పగించారు. వీరు ఓపీ, ఐపీ వార్డులు, నర్సింగ్ స్టాఫ్ విధులు, శానిటేషన్, పేషంట్ కేర్ సర్వీస్, ఎమర్జెన్సీ కేసుల పర్యవేక్షణ ఇతర బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. అలాగే డాక్టర్ రాజేంద్రప్రసాద్‌కు శానిటేషన్ పర్యవేక్షణ, నర్సింగ్, ఇతర సిబ్బంది విధుల పర్యవేక్షణ, వార్డుల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. ఇక డాక్టర్ డి.శ్రీకాంత్ జనరల్ ఆస్పత్రి గ్రౌండ్ ఫ్లోర్‌లో విధులను పర్యవేక్షిస్తారు. ఫలితంగా పెద్దాస్పత్రిలో 24 గంటల పాటు పర్యవేక్షణ ఉంటుందని మెడికల్ సూపరింటెండెంట్ నరేందర్ తెలిపారు.


