మేయర్, చైర్మన్ రిజర్వ్ స్థానాలపై పార్టీల నజర్
కార్పొరేషన్‌పై కన్నేసి..
● ఆయా డివిజన్లు, వార్డుల్లో గెలుపునకు ప్రత్యేక వ్యూహం ● అన్ని పార్టీల నుంచి పోటాపోటీ ప్రచారం
కొన్నిచోట్ల వ్యూహాత్మకం
మేయర్, చైర్మన్ పదవులకు రిజర్వ్ అయిన డివిజన్లు, వార్డుల్లో రాజకీయ పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలను రూపొందించాయి. కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ పీఠం ఎస్టీ జనరల్‌కు రిజర్వు కాగా, ఇక్కడ ఎస్టీలకు రిజర్వ్ అయిన స్థానాలే కాకుండా జనరల్ స్థానంలోనూ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ అభ్యర్థిని బరిలో నిలిపింది. ఏదులాపురం మున్సిపాలిటీ ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. ఇక్కడ తొమ్మిదో వార్డు ఎస్సీ జనరల్‌కు రిజర్వ్ కాగా.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నుంచి అభ్యర్థులు బరిలో నిలిచారు. కల్లూరు మున్సిపాలిటీ ఎస్టీ జనరల్‌కు రిజర్వ్ అయింది. ఈ మున్సిపాలిటీలోని 5వ వార్డు జనరల్ మహిళకు రిజర్వ్ అయినా బీఆర్‌ఎస్ ఎస్టీ మహిళను బరిలో నిలిపింది.
● ఇల్లెందు : ఈ మున్సిపాలిటీ చైర్‌పర్సన్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ అయింది. ఇక్కడ 24 వార్డులకు గాను 18 వార్డులు బీసీలకు రిజర్వ్ అయ్యాయి. దీంతో కాంగ్రెస్ నుంచి 13వ వార్డు అభ్యర్థి మడుగు సాయిసుధ, రెండో వార్డు అభ్యర్థి దొడ్డా కిరణ్‌మిత్ర, 23వ వార్డు నుంచి పోటీ చేస్తున్న కొండపల్లి సరితతో పాటు ఎనిమిదో వార్డు అభ్యర్థి స్వరూప చైర్‌పర్సన్ పదవికి పోటీలో ఉన్నట్లు సమాచారం. ఇక బీఆర్‌ఎస్‌లో 19వ వార్డు నుంచి పింగళి అనూహ్య, 4వ వార్డు నుంచి ఎస్.రాజ వినోద చైర్‌పర్సన్ రేసులో ఉన్నారు.
● ఏదులాపురం : ఈ మున్సిపాలిటీ చైర్మన్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వ్ కాగా, ఈ కేటగిరీలో 9, 17, 23 వార్డులు ఉన్నాయి. ఇందులో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న గొడ్డుగొర్ల కృష్ణవేణి, పోకబత్తిని అనిత, కందుకూరి శేషమ్మ చైర్‌పర్సన్ పదవి ఆశిస్తున్నారు. ఇక డిప్యూటీ చైర్మన్ రేసులో 28వ వార్డు నుంచి పోటీ చేస్తున్న రాంమోహన్‌రెడ్డి, 22 వార్డు అభ్యర్థి వెంకటేశ్వరరెడ్డి ఉన్నారు. బీఆర్‌ఎస్‌లోనూ 9వ వార్డు నుంచి కొట్టె రమాదేవి, 17 నుంచి కర్లపూడి ఇందిర, 23 నుంచి అడ్డాకుల శారద చైర్‌పర్సన్ పదవి ఆశిస్తున్నట్లు సమాచారం.
● మధిర : మున్సిపాలిటీ చైర్‌పర్సన్ పదవిని జనరల్ మహిళకు కేటాయించారు. ఇక్కడ 1, 4, 6, 11, 12, 21వ వార్డులు జనరల్ మహిళకు, 5, 9, 20వ వార్డులు ఎస్సీ మహిళకు, 13, 15వ వార్డులు బీసీ మహిళకు రిజర్వ్ అయ్యా యి. ఆయా వార్డుల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యర్థులు ప్రచారాన్ని ఉధృతం చేశారు. పార్టీ ముఖ్యనేతలు కూడా ప్రచారం చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు.
● వైరా : ఈ మున్సిపాలిటీలో చైర్‌పర్సన్ పదవి జనరల్ మహిళకు రిజర్వ్ కాగా, 2, 6, 12, 13, 15, 19వ వార్డులు జనరల్ మహిళకు, 17, 18వ వార్డులు బీసీ మహిళకు, 4, 20వ వార్డులు ఎస్సీ మహిళకు కేటాయించారు. చైర్‌పర్సన్ పదవికి కాంగ్రెస్‌లో 3వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి, 6వ వార్డు అభ్యర్థి కాపా చంద్రకళతో పాటు 15 వార్డు నుంచి పోటీ చేస్తున్న రాంపూడి రాజ్యలక్ష్మి రేసులో ఉన్నారు. ఇక బీఆర్‌ఎస్ నుంచి ఐదో వార్డు అభ్యర్థి కట్టా స్వరూపరాణి చైర్‌పర్సన్ పదవి ఆశిస్తున్నారు.
● కల్లూరు : ఈ మున్సిపాలిటీ ఎస్టీ జనరల్‌కు రిజర్వ్ అయింది. ఇక్కడ 4, 6, 7వ వార్డులు ఎస్టీ జనరల్‌కు రిజర్వ్ అయ్యాయి. ఏడో వార్డులో కాంగ్రెస్ నుంచి ధరావత్ మోహన్‌నాయక్, బీఆర్‌ఎస్ నుంచి బానోతు కృష్ణ, 4వ వార్డులో కాంగ్రెస్ నుంచి భూక్యా రాంబాయి, బీఆర్‌ఎస్ నుంచి బానోతు బాలు, 6వ వార్డులో కాంగ్రెస్ నుంచి బానోతు మారోని, బీఆర్‌ఎస్ నుంచి బానోతు మమత పోటీ పడుతుండగా వీరు చైర్‌పర్సన్ రేసులో ఉన్నారు.
సత్తుపల్లి : ఇక్కడ చైర్‌పర్సన్ పదవి జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. ఈ మున్సిపాలిటీలో 2, 3, 22, 6, 11వ వార్డులు జనరల్ మహిళకు రిజర్వ్‌డ్‌గా ఉన్నాయి. ఈ వార్డుల నుంచి ఎంపికై న అభ్యర్థుల్లో ఒకరికి చైర్‌పర్సన్ పదవి కట్టబెడతారు. దీంతో అభ్యర్థులు గెలిచేలా శ్రమిస్తుండగా.. అటు కాంగ్రెస్, ఇటు బీఆర్‌ఎస్ ఇప్పటివరకు చైర్‌పర్సన్ పదవిపై ఎవరికీ హామీ ఇవ్వలేదని సమాచారం.
అశ్వారావుపేట : ఇక్కడ చైర్‌పర్సన్ స్థానం జనరల్ మహిళకు రిజర్వ్ కాగా.. ఈ కేటగిరీలో 6, 8 వార్డులు ఉన్నాయి. ఆరో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి శశికళ, బీఆర్‌ఎస్ అభ్యర్థి చిక్కం మాధురిబాయి, 8వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా షేక్ రెహానా, బీఆర్‌ఎస్ నుంచి కాసాని నాగశేష పద్మ బరిలో ఉన్నారు.
కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ స్థానం ఎస్టీ జనరల్‌కు రిజర్వ్ కాగా, ఇక్కడ 9, 23, 31, 34, 52 డివిజన్లు ఎస్టీ మహిళకు, 3, 19, 20, 32, 33, 48 డివిజన్లు ఎస్టీ జనరల్‌కు రిజర్వ్ అయ్యాయి. ఇందులో అభ్యర్థులుగా నిలిచిన వారు గెలిచి మేయర్ రేసులో ఉండాలని ఉవ్విళ్లూరుతున్నారు. కాంగ్రెస్ నుంచి మేయర్ పదవిని ఆరో వార్డు అభ్యర్థి బీ.ఎస్.రావు, 19వ వార్డు నుంచి బరిలో ఉన్న స్వప్న ఆశిస్తున్నారు. మరికొందరు కూడా పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఇక డిప్యూటీ మేయర్ పదవిని కాంగ్రెస్‌లో పిచ్చిరెడ్డి, కొత్వాల విమల ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొత్వాల విమల డీసీఎంఎస్ చైర్మన్ సతీమణి. ఇక సీపీఐ, బీఆర్‌ఎస్‌లు మేయర్ అభ్యర్థిని ఇప్పటివరకు ప్రకటించలేదు. అధిక స్థానాల్లో విజయం సాధిస్తే రిజర్వ్‌డ్ డివిజన్లలో గెలుపొందిన వారి నుంచి ఒకరిని ఎన్నుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది.
మేయర్, చైర్మన్ రిజర్వ్ స్థానాలపై పార్టీల నజర్


