సోలార్‌ ప్లాంట్‌తో రూ.లక్షల్లో ఆదాయం | - | Sakshi
Sakshi News home page

సోలార్‌ ప్లాంట్‌తో రూ.లక్షల్లో ఆదాయం

Feb 5 2026 7:22 AM | Updated on Feb 5 2026 7:22 AM

సోలార్‌ ప్లాంట్‌తో రూ.లక్షల్లో ఆదాయం

సోలార్‌ ప్లాంట్‌తో రూ.లక్షల్లో ఆదాయం

● మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి ● కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి

● మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి ● కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి

ఎర్రుపాలెం: ప్రభుత్వం మహిళలకు ఇస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుని ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి సూచించారు. ఎర్రుపాలెం మండలం రాజుపాలెంలో ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా ఏర్పాటుచేస్తున్న ఒక మెగావాట్‌ సామర్థ్యపు సోలార్‌ ప్లాంట్‌ పనుల పురోగతిని కలెక్టర్‌ బుధవారం పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోలార్‌ పవర్‌ ప్లాంట్ల ఏర్పాటుతో పునరుత్పాదక శక్తిని ప్రోత్సహించడమే కాక మహిళా సాధికారత సాధ్యమవుతుందని తెలిపారు. ప్లాంట్‌ పనుల్లో వేగం పెంచడమే కాక నిర్వహణపై మహిళలకు అవగాహన కల్పించాలని ఉద్యోగులను కలెక్టర్‌ ఆదేశించారు.

రోజుకు రూ.12వేలకు పైగా..

ప్రాజెక్ట్‌ వ్యయం రూ.1.50 కోట్లు కాగా, రుణంలో రూ.85 లక్షలు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని కలెక్టర్‌ తెలిపారు. నిర్వహణ ఖర్చులు పోగా మొదటి, రెండు సంవత్సరాల్లో రూ.4లక్షలు, మూడో సంవత్సరం రూ.5 లక్షలు, ఆతర్వాత 11వ సంవత్సరం రూ.10 లక్షలు ఇలా ఆదాయం పెరుగుతుందని.. 13వ ఏట రుణం తీరాక రూ.40 లక్షల చొప్పున 25ఏళ్ల పాటు మహిళలకు ఆదాయం సమకూరుతుందని చెప్పారు. రోజువారీగా రూ.12 నుంచి రూ.15 వేల ఆదాయం రానున్నందున నిర్వహణలో జాగ్రత్తలు పాటిస్తూ రాష్ట్రంలోనే మొదటి ప్రాజెక్టును ఆదర్శంగా నిలపాలని సూచించారు. తొలుత ఎర్రుపాలెంలోని గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్‌ అనుదీప్‌... తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా బీఆర్‌.అంబేద్కర్‌ చిత్రపటం వద్ద నివాళులర్పించి అధికారులు, విద్యార్థులతో కలిసి సామాజిక ప్రతిజ్ఞ చేశారు. విద్యార్థులు ప్రభుత్వం సమకూరుస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుంటూ చదువులో ప్రతిభ చాటాలని తెలిపారు. ఆతర్వాత 50పడకల ఆస్పత్రి భవన నిర్మాణ పనులను కూడా పరిశీలించారు. అనంతరం మండల పరిషత్‌ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్‌ సమీక్షించారు. విద్యుత్‌ ఎస్‌ఈ శ్రీనివాసాచారి, డీఆర్‌డీఓ కొండపల్లి శ్రీరామ్‌, రెడ్‌కో జిల్లా మేనేజర్‌ పి.అజయ్‌కుమార్‌, డీఆర్‌డీఓ ఏపీడీ జయశ్రీ, మధిర మార్కెట్‌ చైర్మన్‌ బండారు నర్సింహారావు, తహసీల్దార్‌ ఉషాశారద, ఎంపీడీఓ బి.సురేందర్‌, ఏడీఏ విజయచందర్‌, డీపీఎం శ్రీనివాస్‌, ఏపీఎం హరినాఽరాయణ, సర్పంచ్‌లు బొగ్గుల గోవర్దన్‌రెడ్డి, నండ్రు అశ్విని, నాయకులు వేమిరెడ్డి సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement