మున్సిపాలిటీల అభివృద్ధి నా బాధ్యత
● ప్రజలు ఇచ్చిన శక్తితో పాటుపడతా... ● ఏదులాపురం, కల్లూరు ప్రచారంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఖమ్మంరూరల్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం.. అందులో మంత్రిగా తాను ఉండడానికి ప్రజలు ఇచ్చిన శక్తే కారణం.. దీన్ని వంద శాతం ఉపయోగించుకుంటూ మున్సిపాలిటీల అభివృద్ధికి పాటుపడతానని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈమేరకు పోటీలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులను ప్రజలు గెలిపించాలని కోరారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి 10, 11, 28, 29, 30 వార్డు అభ్యర్థుల తరఫున బుధవారం జరిగిన ప్రచారంలో పాల్గొన్న మంత్రి పొంగులేటి మాట్లాడారు. పేదరికమే ప్రాతిపదికన ఏ పార్టీ అని చూడకుండా అర్హులైన ప్రతీ ఒక్కరికీ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందించడమే తమ ధ్యేయమని తెలిపారు. ఏప్రిల్ మరో విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు. ఏదులాపురం మున్సిపాలిటీని రాష్ట్రంలోనే మోడల్‌గా తీర్చిదిద్దే బాధ్యతను తాను తీసుకుంటానని తెలిపారు. ఈమేరకు 11న జరిగే ఎన్నికల్లో ప్రత్యర్ధులకు డిపాజిట్లు రాకుండా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. మాటలు చెప్పే వారిని కాకుండా అనునిత్యం పేదల సంక్షేమం ఆలోచించే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని సూచించారు. ఈ ప్రచారంలో అభ్యర్థులు నూకల రాంమోహన్‌రెడ్డి, కొట్టం శిరీష, పేరం. వెంకటలక్ష్మి, తుమ్మల భిక్షం, వెంపటి ఉమతో పాటు నాయకులు కొట్టం రంజిత్‌రెడ్డి, సైదిరెడ్డి, గణపారపు. వీరన్న, వెంపటి రవి, భూక్యా సురేష్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
నంబర్ వన్‌గా అభివృద్ధి చేస్తా
కల్లూరు రూరల్: కల్లూరు మున్సిపాలిటీని రాష్ట్రంలోనే నెంబర్ వన్‌గా తీర్చిదిద్దుతానని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బుధవారం సాయంత్రం నిర్వహించిన రోడ్డుషోలో సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి, ఐడీసీ చైర్మన్ మువ్వా విజయ్ బాబుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కల్లూరు మెయిన్ సెంటర్‌లో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ తన సొంత మున్సిపాలిటీని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత తనపై ఉందని తెలిపారు. ప్రజల విజ్ఞప్తి మేరకు మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేయించినందున 20 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ను గెలిపించి ప్రజలు తమ బాధ్యత నెరవేర్చాలని సూచించారు. తమ ప్రభుత్వంలో చందాలు, దందాలకు స్థానం లేదని మంత్రి వెల్లడించారు. బీఆర్‌ఎస్ హయాంలో ప్రజలను మోసగిస్తే.. తాము అధికారంలోకి వచ్చాక రైతు రుణమాఫీ చేయడమే కాక పేదలకు రేషన్‌కార్డులు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామని తెలిపారు. నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, పసుమర్తి చందర్రావు, అంకిరెడ్డి సత్యనారాయణరెడ్డి, మార్కె ట్ చైర్‌పర్సన్ బాగం నీరజాదేవి తదితరులు పాల్గొన్నారు.


