యాప్ ద్వారా యూరియా కొనుగోలు సులభం
కొణిజర్ల: రాష్ట్రప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన యాప్ ద్వారా రైతులు యూరియా కొనుగోలు చేయడం సులభమవుతుందని జిల్లా వ్యవసాయ శాఖాధికారి డి.పుల్లయ్య తెలిపారు. కొణిజర్ల సొసైటీ కార్యాలయంలో యూరియా నిల్వలను శుక్రవారం పరిశీలించిన ఆయన స్థానిక డీలర్ల వద్ద యాప్ ద్వారా అమ్మకాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడుతూ రైతుల సమయం వృథా కాకుండా యాప్‌లో బుక్ చేసుకున్న 24 గంటల్లో ఎంపిక చేసుకున్న చోట యూరియా కొనుగోలు చేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైరా ఏడీఏ కరుణశ్రీ, ఏఓ బాలాజీ, సొసైటీ సీఈఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
మూడు రోజుల్లో రూ.5.72 లక్షల వసూళ్లు
సత్తుపల్లిటౌన్: ఎన్నికల పుణ్యమా అని మున్సిపాలిటీల ఖజానాకు కాసులు సమకూరుతున్నాయి. నామినేషన్ దాఖలు చేసే సమయాన అభ్యర్థులే కాక ప్రతిపాదకులు సైతం ఆస్తి, నల్లా పన్ను బకాయి లేనట్టుగా ధ్రువపత్రం సమర్పించాల్సి ఉంటుంది. దీంతో వారంతా బకాయిలు చెల్లించడానికి ముందుకు రావడంతో సత్తుపల్లి, మధిర, కల్లూరు, వైరా, ఏదులాపురం మున్సిపాలిటీల వద్ద ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశారు. ఫలితంగా సిబ్బంది క్షేత్ర స్థాయికి వెళ్లకుండానే పన్నులు వసూలయ్యాయి. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సత్తుపల్లిలో 120మందికి పైగా పన్నులు చెల్లించారు. దీంతో మున్సిపాలిటీకి మూడురోజుల్లో రూ.5.72 లక్షల పన్నులు వసూలు కావడం విశేషం.
బార్ కౌన్సిల్ ఎన్నికల్లో భారీగా పోలింగ్
ఖమ్మం లీగల్/మధిర: రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల్లో భాగంగా ఖమ్మంలో శుక్రవారం పోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఖమ్మం బార్ అసోసియేషన్‌లోని 990 మందికి గాను 887 మంది న్యాయవాదులు ఓటుహక్కు సద్వినియోగం చేసుకున్నారు. ఉదయం 10–30 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగింది. ఎన్నికల అధికారిగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు వ్యవహరించారు. అలాగే, మధిర కోర్టులో 40 మంది న్యాయవాదులకు గాను 39 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల ప్రక్రియను న్యాయమూర్తి దీప్తి వేముల పర్యవేక్షించారు.
విద్యుత్ ఉద్యోగుల బదిలీలకు బ్రేక్
ఖమ్మంవ్యవసాయం: విద్యుత్ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ నిలిచిపోయింది. ఉద్యోగుల, కార్మిక సంఘాల అభ్యర్ధనతో పాటు మున్సిపల్ ఎన్నికల నేపథ్యాన ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయాలని విద్యుత్ అధికారులకు మౌఖిక ఆదేశాలు చేశాయి. ప్రస్తుత స్థానంలో జనవరి 1నాటికి రెండేళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగుల్లో 50 శాతం మందిని బదిలీ చేసేలా ఈనెల 21న షెడ్యూల్ విడుదల చేశారు. ఈమేరకు అర్హుల జాబితా విడుదల చేయగా పలువురు దరఖాస్తు చేసుకోవడంతో 31వ తేదీన ఉత్తర్వులు విడుదల చేయాల్సి ఉంది. అయితే, విద్యా సంవత్సరం మధ్యలో బదిలీలు చేయడం, కాలపరిమితిని రెండేళ్లకు తగ్గించడాన్ని నిరసిస్తూ ఉద్యోగ, కార్మిక సంఘాలు ఆందోళనకు దిగడం, మున్సిపల్ ఎన్నికలు కొనసాగుతుండడంతో ప్రక్రియను నిలిపివేయాలని అధికారులకు ఆదేశాలు అందాయి.
యాప్ ద్వారా యూరియా కొనుగోలు సులభం


