ముగిసిన కీలక పర్వం
● ఐదు మున్సిపాలిటీల్లో 923 నామినేషన్లు దాఖలు ● నేడు పరిశీలించనున్న అధికారులు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: మున్సిపల్ ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ శుక్రవారం ముగిసింది. జిల్లాలోని ఏదులాపురం, సత్తుపల్లి, మధిర, వైరా, కల్లూరు మున్సిపాలిటీల్లో చివరి రోజు 603నామినేషన్లు దాఖలవడం గమనార్హం. సాయంత్రం 5గంటల వరకు క్యూలైన్లలో ఉన్న వారిని అనుమతించారు. ఐదు మున్సిపాలిటీల్లోని 117వార్డులకు మూడు రోజుల్లో కలిపి మొత్తంగా 923 నామినేషన్లు అందగా, వీటిని అధికారులు శనివారం పరిశీలిస్తారు. కాగా, నామినేషన్ల ఉపసంహరణకు వచ్చేనెల 3వరకు గడువు ఉంది.
చివరి రోజు జోరు
మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తెల్లారి నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. మూడు రోజుల సమయమే ఇవ్వడంతో తొలిరోజైన బుధవారం నామమాత్రంగానే దాఖలయ్యాయి. రెండో రోజు నామినేషన్లు సంఖ్య పెరగగా, చివరి రోజైన శుక్రవారం నామినేషన్ కేంద్రాల వద్ద క్యూ కట్టారు. అభ్యర్థులు, వారి అనుచరులతో నామినేషన్ కేంద్రాల పరిసరాలు కిటకిటలాడాయి. కేంద్రాలకు పలువురు డప్పుచప్పుళ్లు, నృత్యాలతో ర్యాలీగా వచ్చారు. కాగా, ఐదు మున్సిపాలిటీలకు గాను అత్యధికంగా వైరాలో 190నామినేషన్లు దాఖలు కాగా, సత్తుపల్లిలో 155 నామినేషన్లే అందాయి. అయితే, ఉపసంహరణల గడువు ముగిశాక వీరిలో ఎందరు బరిలో నిలిచారన్నది తేలనుంది.


