కాంగి‘రేసు’లో.. రెబల్స్
● టికెట్ దక్కని ఆశావహుల నామినేషన్లు ● జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో అదే పరిస్థితి ● బుజ్జగించేందుకు రంగంలోకి నేతలు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగిసింది. పార్టీల వారీగా బరిలో ఉండే అభ్యర్థులెవరో ఓ స్పష్టత వచ్చింది. ఈక్రమాన టికెట్ ఆశించి నిరాశకు గురైన పలువురు రెబల్స్‌గా నామినేషన్లు వేశారు. జిల్లాలోని ఏదులాపురం, వైరా, మధిర, సత్తుపల్లి, కల్లూరు మున్సిపాలిటీల్లో ప్రధానంగా కాంగ్రెస్‌లో ఈ బెడద ఉంది. వీరికి నచ్చజెప్పేందుకు ముఖ్యనేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
మాకేం తక్కువ?
మున్సిపాలిటీల్లో బలమైన అభ్యర్థులు ఎవరన్నది తేల్చేందుకు కాంగ్రెస్ పార్టీ నాలుగైదు సార్లు సర్వే చేయించింది. కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో అన్ని వార్డులో ఆశావహుల సంఖ్య ఎక్కువగానే ఉన్నా సర్వేల్లో అగ్రస్థానాన నిలిచిన వారినే అభ్యర్థులుగా ప్రకటించింది. ఫలితంగా టికెట్ దక్కని ఆశావహులు చివరి వరకు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు నామినేషన్లు వేశారు. దీంతో ఐదు మున్సిపాలిటీల్లోనూ కాంగ్రెస్‌కు రెబల్స్ బెడద తప్పేలా లేదు. సర్వేలో సరైన నివేదిక రాకపోయినా తామేం తక్కువ కాదంటూ టికెట్ దక్కని ఆశావహులు పోటీకి దిగడంతో వీరిని బుజ్జగించడం పార్టీ నేతలకు తలకు మించిన భారంలా మారనుంది.
ఈ నాలుగు రోజులు కీలకం
నామినేషన్ల ఉపసంహరణకు వచ్చే నెల 3వరకు గడువు ఉంది. అప్పటిలోగా రెబల్స్‌ను బుజ్జగించి బరి నుంచి తప్పించాల్సి ఉంటుంది. అయితే, కొందరు రెబల్స్ నామినేషన్ వేసింది మొదలు ప్రచారం కూడా ప్రారంభించారు. దీంతో పార్టీ ప్రకటించిన అభ్యర్థులకు కునుకు కరువైంది. రెబల్స్‌ను పోటీ నుంచి తప్పించాలంటూ ముఖ్య నేతలను వేడుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీ అభ్యర్థికి బీ ఫామ్ ఇవ్వడం.. మిగతా వారిని బరిలో లేకుండా చూడడం నేతలకు కత్తి మీద సాములా మారనుంది. ఈనేపథ్యాన మున్సిపాలిటీల వారీగా రంగంలోకి దిగిన ముఖ్య నేతలు, మరో మూడేళ్లు రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉంటుందని.. ఇతర పదవులు ఇస్తామనే ప్రతిపాదనలతో రెబల్స్‌ను శాంతపర్చడంపై దృష్టి సారించారు.


