వేసవికి ముందస్తు సిద్ధం
సర్వేతో పూర్తి స్థాయి నివేదిక
● నీటి సరఫరాలో అంతరాయాల గుర్తింపునకు డ్రైవ్ ● రేపటి నుంచి 20రోజుల పాటు కొనసాగనున్న సమగ్ర సర్వే
ఖమ్మంఅర్బన్: రానున్న వేసవిలో జిల్లాలో ఎక్కడా తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులు ముంద స్తు చర్యలకు శ్రీకారం చుట్టారు. జిల్లా వ్యాప్తంగా తాగునీటి సరఫరాకు ఉపయోగిస్తున్న పైపులైన్లు, మోటార్లు, చేతి పంపులు, ఓవర్‌హెడ్ ట్యాంకులు, బావులను పరిశీలించి అవసరమైన మరమ్మతులు చేపట్టేలా సమగ్ర సర్వే నిర్వహించనున్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆదేశాలతో ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు హ్యాబిటేషన్లు వారీగా పరిశీలించి నివేదిక రూపొందించనున్నారు. ఇందులో భాగంగా ప్రతీ తాగునీటి పథకాన్ని పరిశీలించి, అవసరమైన మరమ్మతులు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై నివేదిక సిద్ధం చేయనుండగా.. తక్షణ మరమ్మతుల కోసం నిధులు మంజూరు అవుతాయని చెబుతున్నారు.
20రోజుల పాటు సర్వే
జిల్లాలోని అన్ని ఆవాసాల్లో ఫిబ్రవరి 1(ఆదివారం) నుంచి నుంచి 20వ తేదీ వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నారు. ప్రతీ గ్రామంలో తాగునీటి వనరుల స్థితిగతులు, పనిచేయని పథకాలు, లీకేజీలు, మోటార్ల పరిస్థితి, పైపులైన్ లోపాలను గుర్తిస్తారు. ఆతర్వాత అవసరమైన మరమ్మతులపై ప్రభుత్వానికి నివేదించనున్నారు.
నాలుగింటిపై ప్రత్యేక దృష్టి
ప్రస్తుతం తాగునీటి సమస్య ఎక్కువగా ఉన్న నాలుగు ఆవాసాలను ప్రాథమికంగా గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో నీటి వనరులకు అత్యవసరంగా మరమ్మతు చేపట్టడమే కాక, అప్పటివరకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు ప్రణాళిక రూపొందించారు. అలాగే, 20రోజుల పాటు చేపట్టే ప్రత్యేక డ్రైవ్‌లో గుర్తించే లోపాలను సరిచేయడం ద్వారా రానున్న వేసవిలో ఎక్కడా తాగునీటి ఎద్దడి ఎదురుకాకుండా చూస్తామని యంత్రాంగం చెబుతోంది.
జిల్లాలో తాగునీటి సరఫరా, సమస్యలపై పూర్తి స్థాయిలో సర్వే చేయనున్నారు. తద్వారా లోపాలపై స్పష్టత రానుండగా ప్రభుత్వానికి నివేదిక ఇస్తాం. ఈ సర్వే ఆదివారం నుంచి ఫిబ్రవరి 20వ తేదీ వరకు కొనసాగుతుంది. వేసవిలో ఎక్కడా తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అన్నిచర్యలు తీసుకుంటాం.
– పుష్పలత, ఈఈ, ఆర్‌డబ్ల్యూఎస్
వేసవికి ముందస్తు సిద్ధం


