కుష్ఠు వ్యాధి రహిత సమాజమే ధ్యేయం
ఖమ్మంవైద్యవిభాగం: కుష్ఠు వ్యాధి రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా అందరూ కృషి చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన జాతీయ కుష్ఠు వ్యాధి నిర్మూలన సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. తొలుత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జాతిపిత మార్గంలో నడవడమే ఆయనకు ఇచ్చే నివాళి అని తెలిపారు. కుష్ఠు రోగులకు ఎదురవుతున్న వివక్ష, వారి సమస్యలను గుర్తించి గాంధీ సేవలందించారని చెప్పారు. ఈమేరకు బాధితులపై ఎవరు కూడా వివక్ష చూపొద్దని సూచించారు. కాగా, మందులతో పూర్తిగా నయమయ్యే ఈ వ్యాధికి ఉచితంగా చికిత్స ఉంటుందని, శరీరంపై మొద్దుబారిన మచ్చలు ఉన్న వారు ప్రభుత్వ ఆస్పత్రిలో సంప్రదించాలని సూచించారు. జిల్లాలో ఇటీవల గుర్తించిన 74 మంది బాధితులకు చికిత్స కొనసాగుతోందని కలెక్టర్ తెలిపారు. ఈ అంశంపై ప్రచార కార్యక్రమాన్ని ఫిబ్రవరి 13వరకు నిర్వహించనుండగా, ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. డీఎంహెచ్‌ఓ రామారావు, డీసీహెచ్‌ఎస్ రాజశేఖర్, అధికారులు చందునాయక్, వేణుమనోహర్, కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి


