విద్యార్థులకు శాపంగా సంస్కరణలు
పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్ష,
ప్రధాన కార్యదర్శులు పృథ్వీ, అనిల్
ఖమ్మంమయూరిసెంటర్: మూడు దశాబ్దాలుగా విద్యా రంగంలో వస్తున్న సంస్కరణలు విద్యార్థులకు శాపంగా మారాయని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కాంపాటి పృథ్వీ, ఎస్.అనిల్ పేర్కొన్నారు. ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఖమ్మంలో మూడు రోజుల పాటు జరిగిన పీడీఎస్‌యూ రాష్ట్ర మహాసభలు విజయవంతంగా ముగియగా, రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో పాటు, విద్యా రంగ సమస్యలపై పలు తీర్మానాలను ఆమోదించినట్లు తెలిపారు. విద్యాసంస్థల్లో విద్యార్థి సంఘం ఎన్నికలను నిర్వహించాలని, చట్టసభల ఆమోదం లేకుండా ఆమోదించిన నూతన జాతీయ విద్యా విధానంను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, రూ.లక్షల్లో ఫీజులు దండుకుంటున్న ప్రైవేట్ సంస్థలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. పెరిగిన ధరలకనుగుణంగా హాస్టల్ మెస్ చార్జీలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పెంపు, ఖాళీగా ఉన్న ఎంఈఓ పోస్టులను భర్తీ చేయాలని, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను విద్యార్థుల సంక్షేమానికే ఖర్చు చేయాలనే తదితర తీర్మానాలు ఆమోదించినట్లు వారు తెలిపారు. కాగా, నూతన రాష్ట్ర నాయకత్వాన్ని మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకుందని వెల్ల డించారు. రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా కంపాటి పృధ్వీ(భద్రాద్రి కొత్తగూడెం), ఎస్.అనిల్(నారాయణపేట)తో పాటు మిగతా కార్యవర్గాన్ని ఎన్నుకున్నామని తెలిపారు. ఈ సమావేశంలో పీడీఎస్‌యు రాష్ట్ర ఉపాధ్యక్షులు నర్సింహారావు, నరేందర్, శివ, నాయకులు వెంకటేష్, వీరభద్రం, లక్ష్మణ్, శశికిరణ్ తదితరులు పాల్గొన్నారు.


